|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 08:38 PM
గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో చమురు అక్రమ రవాణాపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీ పరిమాణంలో అక్రమ చమురును తరలిస్తున్న ఒక నౌకను ఇరాన్ దళాలు సీజ్ చేశాయి. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే సీజ్ చేసిన ఆ నౌకలో 60 లక్షల లీటర్ల అక్రమ చమురు ఉన్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. "అక్రమంగా చమురును తరలిస్తుండటంతో.. నౌకలోని నావిగేషన్ వ్యవస్థలు అన్నింటినీ నిలిపి వేయడం జరిగింది" అని ఇరాన్ అధికారులు తెలిపారు. ఈ నౌకలో మొత్తం 18 మంది సిబ్బంది ఉండగా వారిలో భారతీయ నావికులతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలకు చెందిన సిబ్బంది కూడా ఉన్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఎందుకు సీజ్ చేశారు?
ప్రపంచంలో చమురు ఎగుమతి చేసే దేశాల్లో ఇరాన్ ఒకటి. ఈ దేశంలో చమురు ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ ధరల వ్యత్యాసాన్ని ఆసరాగా తీసుకుని.. కొందరు వ్యాపారులు ఇరాన్ నుంచి చమురును అక్రమంగా ఇతర దేశాలకు తరలించి, భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకే ఇరాన్ అధికారులు తరచూ గల్ఫ్ ప్రాంతంలో తనిఖీలను నిర్వహిస్తూ.. అక్రమ చమురు రవాణా నౌకలను సీజ్ చేస్తున్నారు. ఇరాన్ గతంలో కూడా పలుమార్లు అక్రమంగా ఇంధనం రవాణా చేస్తోన్న నౌకలను అడ్డుకున్నట్లు వెల్లడించింది.
గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఇరాన్ ఈ చర్య తీసుకున్న రెండు రోజులకే.. వెనెజువెలా తీరంలో అమెరికా కూడా ఒక ఆయిల్ ట్యాంకర్‌ను సీజ్ చేయడం గమనార్హం. ఆ నౌక కెప్టెన్.. వెనెజువెలా, ఇరాన్ నుంచి అక్రమంగా చమురు రవాణా చేస్తున్నాడనే ఆరోపణలతో అగ్రరాజ్యం ఆ నౌకను అడ్డుకుంది. మొత్తంగా ఈ అక్రమ చమురు రవాణా కార్యకలాపాల కారణంగా గల్ఫ్ ప్రాంతంలో, అంతర్జాతీయ జలాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సీజ్ చేసిన నౌక సిబ్బందిని ఇరాన్ అధికారులు ఎక్కడికి తరలించారు, వారి విడుదలపై ఎటువంటి సమాచారం అందుబాటులో ఉందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Latest News