|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 11:20 AM
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్ గోయల్‌ను కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ప్రధాన కమిషనర్‌గా నియమించారు. ఈ నియామకంతో దాదాపు ఏడేళ్ల తర్వాత సీఐసీ పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ ఈయన పేరును ఎంపిక చేసింది. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా సభ్యులుగా ఉన్నారు.
రాజ్‌కుమార్ గోయల్ 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కాగా, అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరాం-యూనియన్ టెరిటరీస్ (ఏజీఎంయూటీ) క్యాడర్‌కు చెందినవారు. ఆయన ఇటీవలే న్యాయ శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. అంతకుముందు హోం మంత్రిత్వ శాఖలో బోర్డర్ మేనేజ్‌మెంట్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఈ నియామకంతో సమాచార హక్కు చట్టం అమలుపై పర్యవేక్షణ మరింత బలోపేతమవుతుందని అధికారులు తెలిపారు.
అదనంగా, ఎనిమిది మంది సమాచార కమిషనర్ల పేర్లను కూడా ఈ ప్యానెల్ సిఫారసు చేసింది. వీరిలో మాజీ రైల్వే బోర్డు చైర్‌పర్సన్ జయవర్మ సిన్హా, మాజీ ఐపీఎస్ అధికారి స్వాగత్ దాస్, సీనియర్ జర్నలిస్టులు పీఆర్ రమేశ్, అశుతోష్ చతుర్వేది వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ నియామకాలతో 11 మంది సభ్యులతో కూడిన సీఐసీ పూర్తి బలంతో పనిచేయనుంది.
డిసెంబర్ 15న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా రాజ్‌కుమార్ గోయల్ ప్రధాన సమాచార కమిషనర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తర్వాత ఆయనే కొత్తగా ఎంపికైన ఎనిమిది మంది సమాచార కమిషనర్లకు ప్రమాణం చేయించనున్నారు. సెప్టెంబర్ నుంచి నాయకత్వం లేకుండా ఉన్న సీఐసీకి ఈ నియామకాలు కొత్త ఊపిరి పోస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.