|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 01:22 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం గిట్టుబాటు లేక నష్టాలపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని, ప్రతి వారం కనీసం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని వైయస్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ ( వ్యవసాయం మరియు రైతు సంక్షేమం) ఎంవీయస్ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలోనే 300 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కానీ ఏ ఒక్కరికీ పరిహారం చెల్లించి ఆదుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే పరిస్థితి దాపురించిందని చెప్పారు. మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే గొప్పలు, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు చెల్లించి చూపించాలని డిమాండ్ విసిరారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారాన్ని పెంచి తక్షణం చెల్లించాలని, ఆ సాయాన్ని కూడా నేరుగా బాధిత కుటుంబ సభ్యుల ఖాతాల్లోనే జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యవసాయంపై చిత్తశుద్ధి ఉంటే గత వైయస్ఆర్‌సీపీ హయంలో మాదిరిగా ఇన్‌పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ రుణం పథకాలను అమలు చేసి అండగా నిలవాలని సూచించారు.
Latest News