|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 01:24 PM
బాధ్యత గల పదవుల్లో ఉన్న బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవో, చైర్మన్ లు భక్తుల మనోభావాలను గౌరవించాల్సిందిపోయి 40 రోజులపాటు భవానీ దీక్ష చేసి విరమణ కోసం ఇరుముడితో వచ్చిన భక్తులను అవమానించారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తి శ్రద్ధలతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల ఇరుమడిని శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు, లేదా గురుస్వాములు విప్పాల్సి ఉంటే అందుకు విరుద్దంగా ఆలయ ఈవో, చైర్మన్‌లు చేతులు పెట్టి భక్తులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాకి వీడియో రిలీజ్ చేశారు. అయన మాట్లాడుతూ... ఆలయ అర్చకులు, గురు స్వాములు చేయాల్సిన పనిని వారు చేయడం చాలా తప్పు. కనీసం భవానీ మాలధారణలో కూడా లేకుండా ఇరుముడులను విప్పడం ధర్మానికి విరుద్ధం. చేతిలో అధికారం ఉంది కదా ఏది చేసినా చెల్లుతుందన్న అహంకారంతో వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. భవానీ దీక్ష ధారుల ఇరుముడిని విప్పి బియ్యం, కొబ్బరి కాయలను అర్చకులు కాకుండా ఇతరులు తీయడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. అది కూడా భవానీ దీక్షల విరమణ కార్యక్రమం మొదలైన రోజునే ఈ ఘటన జరగడం చాలా బాధాకరం. అమ్మవారి గుడిలో జరిగిన అపచారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఆలయ ఈవోను తక్షణం సస్పెండ్ చేయాలి. చైర్మన్‌ను తొలగించాలని వైయస్ఆర్‌సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నా. హిందూ భక్తుల మనోభావాలను గాయపరిచేలా జరిగిన ఈ చర్యను వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తుందని వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు.
Latest News