|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 04:32 PM
భారత యువ సంచలనం, ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డును బద్దలు కొట్టేందుకు అడుగు దూరంలో నిలిచాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును అధిగమించేందుకు అతనికి కేవలం 87 పరుగులు అవసరం. ఈరోజు దక్షిణాఫ్రికాతో జరగనున్న మ్యాచ్‌లో అభిషేక్ ఈ ఘనత సాధించే అవకాశం ఉంది.2016లో విరాట్ కోహ్లీ 31 టీ20 మ్యాచ్‌లలో 89.66 అద్భుత సగటుతో 4 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలతో కలిపి మొత్తం 1,614 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ ఇప్పటివరకు 39 టీ20 మ్యాచ్‌లు ఆడి 41.43 సగటుతో 1,533 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, తొమ్మిది అర్ధ సెంచరీలు ఉన్నాయి.ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అభిషేక్ ప్రదర్శన మిశ్రమంగా ఉంది. కటక్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. న్యూ చండీగఢ్‌లో జరిగిన రెండో టీ20లో 8 బంతుల్లో 2 సిక్సర్లతో 17 పరుగులు చేసి వేగంగా ఆడినా, ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అదే మ్యాచ్‌లో ఒకే ఏడాదిలో అంతర్జాతీయ టీ20ల్లో 50 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు.ప్రస్తుతం 1-1తో సిరీస్ సమంగా ఉన్న నేపథ్యంలో ఇవాళ్టి ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో అభిషేక్ శర్మ రాణించి ఈ రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడో లేదోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Latest News