|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 04:34 PM
హర్యానాలో దట్టమైన పొగమంచు కారణంగా ఇవాళ పలుచోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్లపై కనీసం దారి కూడా కనిపించకపోవడంతో బస్సులు, ట్రక్కులతో సహా దాదాపు 40 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు డ్రైవర్లు, ప్రయాణికులు గాయపడ్డారు. ముఖ్యంగా రోహ్తక్, హిసార్, రేవాడీ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.రోహ్తక్‌లోని మెహమ్ ప్రాంతంలో ఒక హైవే కూడలి వద్ద సుమారు 35 నుంచి 40 వాహనాలు గొలుసుకట్టుగా ఢీకొన్నాయి. మొదట ఒక ట్రక్కు, కారు ఢీకొనగా, వెనుక వస్తున్న వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొంటూ వెళ్లాయి. ఈ ఘటనలో అనేక వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఒక ట్రక్కు పూర్తిగా దెబ్బతినగా, అందులో చిక్కుకున్న వారిని స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు.ఇదే తరహాలో రేవాడీలోని జాతీయ రహదారి 352పై దారి కనిపించకపోవడంతో మూడు, నాలుగు బస్సులు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలోనూ పలువురు గాయపడ్డారు.
Latest News