|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 04:50 PM
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ రాబోయే IPL 2026 మినీ ఆక్షన్‌లో అత్యధిక ధరను సాధించే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 16న అబుధాబీలో జరగనున్న ఈ వేలంలో గ్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ తరఫున ఆడిన గ్రీన్ ఈసారి మళ్లీ వేలంలోకి వచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ రాణిస్తాడన్న నమ్మకంతో ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నాయి. అతని బేస్ ప్రైస్ రూ.2 కోట్లుగా నిర్ణయించారు.
ఆసక్తికర విషయం ఏమిటంటే, గ్రీన్ బ్యాటర్‌గా రిజిస్టర్ చేసుకున్నాడు. దీంతో వేలం మొదటి సెట్‌లోనే అతని పేరు రానుంది. మినీ ఆక్షన్‌లో టీమ్‌లు మొదట్లోనే పూర్తి పర్స్‌తో బిడ్డింగ్ చేస్తాయి కాబట్టి, ఇది అతనికి ప్రయోజనకరంగా మారవచ్చు. కొందరు విశ్లేషకులు ఇది ఉద్దేశపూర్వక వ్యూహమని అనుకున్నారు. అయితే గ్రీన్ స్వయంగా స్పష్టం చేశాడు – తన మేనేజర్ పొరపాటున రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేశాడని. బౌలింగ్‌కు పూర్తిగా ఫిట్‌గా ఉన్నానని, IPLలో రెండు పాత్రల్లోనూ ఆడతానని ఆయన తెలిపాడు.
బ్యాక్ సర్జరీ కారణంగా IPL 2025ను మిస్ చేసిన గ్రీన్ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. ఆసీస్ జట్టులో ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న ఆయనకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మినీ ఆక్షన్ నియమాల ప్రకారం ఓవర్సీస్ ప్లేయర్ గరిష్ఠ ధర రూ.18 కోట్లకు పరిమితమవుతుంది. అయినప్పటికీ బిడ్డింగ్ వార్ తీవ్రంగా సాగే అవకాశం ఉంది. గ్రీన్‌ను కొనుగోలు చేయడం ఏ టీమ్‌కైనా గేమ్ ఛేంజర్ అవుతుందనే అభిప్రాయం నెలకొంది.
అత్యధిక పర్స్ (రూ.64.30 కోట్లు) ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) గ్రీన్‌పై గట్టి పోటీ ఇస్తుందని అంచనాలు. ఆండ్రే రస్సెల్ రిటైర్మెంట్, వెంకటేష్ అయ్యర్ రిలీజ్ తర్వాత ఆల్‌రౌండర్ కోసం వెతుకుతున్న KKRకు గ్రీన్ పర్ఫెక్ట్ ఫిట్. చెన్నై సూపర్ కింగ్స్ వంటి ఇతర టీమ్‌లు కూడా బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు. మొత్తంగా గ్రీన్ ఈ వేలంలో రికార్డు ధర సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.