|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 01:18 PM
రాజధాని ఢిల్లీని ఈరోజు ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. వాయు కాలుష్యం 'తీవ్ర' స్థాయికి చేరడంతో నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గాలి నాణ్యత సూచీ (AQI) ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో దృశ్యమానత తగ్గింది. ఫలితంగా విమాన, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకారం, ఇవాళ ఉదయం 6 గంటలకు ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ 456గా నమోదైంది. ఇది ఈ సీజన్‌లోనే రెండో అత్యంత గరిష్ఠ స్థాయి. ఆదివారం ఏక్యూఐ 461గా నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అక్షర్‌ధామ్ వద్ద ఏక్యూఐ 493గా, బారాఖంబా రోడ్డులో 474గా నమోదైంది.కాలుష్యం కారణంగా ఏర్పడిన పొగమంచుతో ఢిల్లీ విమానాశ్రయంలో సుమారు 100 విమానాలు రద్దు కాగా, 300కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు 90కి పైగా రైళ్లు 6 నుంచి 7 గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్, ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి సంస్థలు ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు జారీ చేశాయి. ప్రయాణానికి ముందు తమ విమాన సర్వీసుల వివరాలు తెలుసుకోవాలని కోరాయి.
Latest News