|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 07:32 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. కేవలం 9 రోజుల వ్యవధిలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకుని దటీజ్ పవన్ కళ్యాణ్ అనిపించుకున్నారు. హామీ ఇచ్చిన తొమ్మిది రోజుల్లో ఓ పాఠశాలకు.. 25 కంప్యూటర్లు, లైబ్రరీ నిండుగా పుస్తకాలు సమకూర్చారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూల్లో అందుబాటులో ఉన్న గ్రంథాలయం, ల్యాబ్, పాఠశాల గదులను డిప్యూటీ సీఎం పరిశీలించారు.
ఈ సమయంలోనే శారదా స్కూలు లైబ్రరీలో పుస్తకాలు తక్కువగా ఉండడాన్ని పవన్ కళ్యాణ్ గమనించారు. అనంతరం జరిగిన సమావేశంలో స్కూలు లైబ్రరీ నిండుగా పుస్తకాలు, 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేయిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. కేవలం తొమ్మిది రోజుల్లోనే తన హామీ నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లతో అధునాతన స్కిల్ ల్యాబ్ ఏర్పాటు చేయించారు. పుస్తకాలతో గ్రంథాలయాన్ని నింపేశారు.పెద బాలశిక్ష నుంచి కాశీమజిలీ కథల వరకు పలు పుస్తకాలను అందుబాటులో ఉంచారు. అలాగే విద్యార్థుల కోసం స్పోకెన్ ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, ఒడియా వంటి భాషల పుస్తకాలను సమకూర్చారు. మొత్తం రూ. 25 లక్షల వరకూ ఖర్చు చేసి పవన్ కళ్యాణ్ వీటిని ఏర్పాటు చేయించారు.
సోమవారం రోజున చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీలను ప్రారంభించి విద్యార్ధులకు అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు పాఠశాలల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టికి పెట్టారు. క్షేత్ర స్థాయి పర్యటనల సమయంలో పవన్ కళ్యాణ్ విద్యార్ధులకు అందుబాటులో ఉన్న వసతులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటారు. వాటిని సమకూరుస్తుంటారు.
గతంలో అన్నమయ్య జిల్లాలోని మైసూరవారిపల్లిలో పర్యటించినప్పుడు.. ఆ గ్రామంలోని పాఠశాలకు ఆట స్థలం లేదని తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. రూ. 65 లక్షల సొంత నిధులు వెచ్చించి గ్రౌండ్ ఏర్పాటు చేయించారు. కడప మున్సిపల్ స్కూల్ సందర్శించిన సమయంలో.. అక్కడి పరిస్థితులను గమనించి మోడల్ కిచెన్ ఏర్పాటు చేయించారు.
Latest News