|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 08:34 PM
ఓ కార్యక్రమంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యవహరించిన తీరుపై తీవ్ర దుమారం రేగుతోంది. డిసెంబరు 15న (సోమవారం) పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో కొత్తగా ఎంపికైన ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలను అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగానికి ఎంపికైన ముస్లిం మహిళ హిజాబ్ ధరించి హాజరయ్యారు. ఆమెకు నియామక పత్రాన్ని అందజేసిన తర్వాత ముఖ్యమంత్రి ఆ మహిళ ధరించిన హిజాబ్ గురించి అడిగి, దానిని తీసివేయమని సూచించారు. ఆ వెంటనే ఆయనే స్వయంగా దానిని తొలగించారు. ఈ సందర్భంగా అక్కడున్న కొందరు నవ్వడంతో ఆమె కలత చెందారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ముఖ్యమంత్రి తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
మొత్తం 1283 మంది ఆయుష్ వైద్యులకు (685 ఆయుర్వేదిక్, 393 హోమియోపతి, 205 యునానీ) తన నివాసంలో సీఎం నితీష్ కుమార్ అపాయింట్‌మెంట్ ఆర్డర్లను అందజేశారు. ఈ క్రమంలో ఉద్యోగానికి ఎంపికైన నుస్రత్ పర్వీన్ తన నియామక పత్రం అందుకోడానికి వచ్చారు. ఆమెకు ఆర్డర్ కాపీ ఇచ్చిన సీఎం.. హిజాబ్ తొలగించడంతో నుస్రత్‌ను చూసి అక్కడున్నవారు కొందరు నవ్వారు. ఈ వీడియోను ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రీయ జనతా దళ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నితీష్ కుమార్‌పై విరుచుకుపడింది. ఆయన మానసిక పరిస్థితి పూర్తిగా క్షీణించిపోయిందా? అని ప్రశ్నించింది.
‘నితీష్ కుమార్ జీకి ఏం జరుగుతోంది? ఆయన మానసిక పరిస్థితి పూర్తిగా క్షీణించిపోయిందా లేదా నితీష్ బాబు ప్రస్తుతం 100 శాతం పక్కా సంఘ్ మనిషిగా మారిపోయారు’ అంటూ దుమ్మెత్తి పోసింది. సీఎం అత్యంత దారుణంగా వ్యవహరించారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
‘‘నియమాక పత్రాన్ని అందుకోడానికి వచ్చిన ఓ మహిళా డాక్టర్ హిజాబ్‌ను నితీశ్ కుమార్ తొలిగించారు.. అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ఇంతటి అవమానకరమైన రీతిలో ప్రవర్తిస్తే, ఆ రాష్ట్రంలో మహిళలకు భద్రత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.. ఇది సిగ్గుమాలిన చర్య.. తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి.. ఇటువంటి దుష్ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరానిది’’ అని కాంగ్రెస్ పార్టీ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టింది.