|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 03:08 PM
శ్రీలంకకు 1996లో తొలిసారిగా క్రికెట్ ప్రపంచ కప్ అందించిన లెజెండరీ కెప్టెన్, మాజీ మంత్రి అర్జున రణతుంగ అవినీతి కేసులో చిక్కుకున్నారు. పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న రణతుంగ, దేశానికి తిరిగి రాగానే అదుపులోకి తీసుకుంటామని అవినీతి నిరోధక దర్యాప్తు కమిషన్ సోమవారం కొలంబో కోర్టుకు తెలియజేసింది.2017లో రణతుంగ పెట్రోలియం మంత్రిగా ఉండగా, ఆయన సోదరుడు ధమ్మిక రణతుంగ ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ సమయంలో దీర్ఘకాలిక చమురు కొనుగోలు ఒప్పందాల నిబంధనలను మార్చివేసి, అధిక ధరకు స్పాట్ పద్ధతిలో 27 సార్లు కొనుగోళ్లు జరిపారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు 800 మిలియన్ శ్రీలంక రూపాయల (దాదాపు రూ. 23.5 కోట్లు) నష్టం వాటిల్లిందని కమిషన్ తన నివేదికలో పేర్కొంది.ఈ కేసులో ఇప్పటికే రణతుంగ సోదరుడు ధమ్మికను అధికారులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఆయనకు బెయిల్ మంజూరైంది. శ్రీలంక, అమెరికా ద్వంద్వ పౌరసత్వం ఉన్న ధమ్మిక దేశం విడిచి వెళ్లకుండా న్యాయస్థానం ప్రయాణ నిషేధం విధించింది. కేసు తదుపరి విచారణను మార్చి 13కి వాయిదా వేసింది.
Latest News