|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 03:15 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖపట్నం నేవీ గూఢచర్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు మరో ఇద్దరు నిందితులను దోషులుగా నిర్ధారించింది. సోమవారం ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఇద్దరు నిందితులకు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.దోషులుగా తేలిన వారిలో మహారాష్ట్రకు చెందిన సోమనాథ్ సంజయ్ ఇకాడే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోను కుమార్ ఉన్నారు. వీరిద్దరికీ యూఏ(పీ)ఏ చట్టంలోని సెక్షన్ 18, అధికారిక రహస్యాల చట్టంలోని సెక్షన్ 3 కింద వేర్వేరుగా ఐదేళ్ల 11 నెలల 15 రోజుల సాధారణ జైలుశిక్ష విధిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. దీంతో పాటు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఏడాది జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.సోషల్ మీడియా ద్వారా పాకిస్థానీ గూఢచారులతో సంబంధాలు పెట్టుకుని, భారత నౌకాదళానికి చెందిన కీలక రహస్యాలను పంచుకున్నారనే ఆరోపణలతో 2019 డిసెంబర్‌లో వీరిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. తాజా తీర్పుతో ఈ కేసులో శిక్ష పడిన వారి సంఖ్య 10కి చేరింది. మరో ఐదుగురు నిందితులపై విచారణ కొనసాగుతోంది.
Latest News