|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 10:42 PM
బ్రెజిల్‌లో సంభవించిన ఆకస్మిక తుపాను పెను విధ్వంసాన్ని మిగిల్చింది. రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో గుయైబా నగరంలో సంభవించిన తీవ్ర తుఫాను కారణంగా గంటకు 90 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన గాలులు వీచాయి. ఈ బలమైన గాలుల ధాటికి స్థానిక రిటైల్ స్టోర్ హవాన్ మెగాస్టోర్ బయట ఏర్పాటు చేసిన 24 మీటర్లు (79 అడుగులు) ఎత్తైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం కుప్పకూలిపోయింది. విగ్రహం నెమ్మదిగా ముందుకు వంగి ఖాళీ పార్కింగ్ స్థలంలో పడిపోవడాన్ని స్థానికులు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి. అధికారుల హెచ్చరికల నేపథ్యంలో సిబ్బంది, స్థానికులు అప్రమత్తమై.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడం, అక్కడి నుంచి వాహనాలను తరలించడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని పేర్కొన్నారు.
డిసెంబర్ 15వ తేదీన దక్షిణ బ్రెజిల్‌ను తాకిన శక్తివంతమైన తుఫాను కారణంగా.. ఈ విధ్వంసం జరిగింది. 2020లో ఇంజనీరింగ్ ఆమోదంతో.. ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తుఫాను నేపథ్యంలో గంటకు 90 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వీచిన గాలుల ధాటికి ఆ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం మొదట నెమ్మదిగా వంగింది. ఆ తర్వాత కొద్దిసేపటికి పక్కనే ఉన్న ఖాళీ పార్కింగ్ స్థలంలో కూలింది.
ప్రమాదం జరిగిన సమయంలో స్థానికంగా ఉన్నవారు వెంటనే అలర్ట్ అయ్యారు. అక్కడ ఉన్న వాహనాలను వెంటనే తరలించడంతో ఆ విగ్రహం కూలిపోయినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం కూలిపోయినప్పటికీ.. దాని కింద ఉన్న 11 మీటర్ల ఎత్తైన కాంక్రీట్ దిమ్మె మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది.
ఆ విగ్రహం కూలిపోయిన ఘటనను గుయైబా మేయర్ మార్సెలో మరానటా సోషల్ మీడియాలో ధృవీకరించారు. హవాన్ సిబ్బంది తక్షణమే ఆ ప్రాంతంలో అందర్నీ ఖాళీ చేయించడం వల్ల ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. అన్ని ఇక హవాన్ మెగాస్టోర్ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండానే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ శిథిలాల తొలగింపు చేపట్టారు. అయితే.. దేశవ్యాప్తంగా తమ అన్ని విగ్రహాలు సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని సదరు కంపెనీ స్పష్టం చేసింది. మరోవైపు.. ఈ ఘటనపై అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది.
బ్రెజిల్ పౌర రక్షణ సంస్థ తుఫాను హెచ్చరికలను ముందస్తుగానే ప్రజలకు తెలియజేయడానికి మొబైల్ ఫోన్‌లకు మెసేజ్‌లు పంపించింది. తుఫాను, బలమైన గాలులు, కూలిపోయే ప్రమాదం ఉన్న నిర్మాణాల గురించి హెచ్చరించింది. తీవ్రమైన వేడి, శీతల గాలి కలయికతో ఏర్పడిన ఈ అల్పపీడన వ్యవస్థ కారణంగా రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో ఈ తుఫాను సంభవించింది. గతంలో 2021లో కాపావో డా కానోవాలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులు, తుఫాను సమయంలో మరో హవాన్ విగ్రహం కూలిపోయింది. అప్పుడు కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Latest News