|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 11:18 PM
భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నారు. దాదాపు అన్ని రంగాల్లోకి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను విస్తరించిన సంగతి తెలిసిందే. విద్యుత్, పెట్రో కెమికల్స్, నాచురల్ గ్యాస్, రిటైల్, ఎంటర్‌టైన్‌మెంట్, టెలీకమ్యూనికేషన్స్, టెక్స్‌టైల్స్, మీడియా, గ్రీన్ ఎనర్జీ ఇలా అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతోంది. 2016లో తీసుకొచ్చిన టెలికాం కంపెనీ జియోతో సంచలనాలకు కేరాఫ్‌గా మారారు అంబానీ. టెలికాం రంగంలో డేటా ధరల్ని తగ్గించి.. అన్‌లిమిటెడ్ డేటా తీసుకొచ్చి అప్పట్లో.. విప్లవం సృష్టించారు. ఇప్పుడు మళ్లీ జియో తరహాలోనే వైద్య రంగంలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. జినోమిక్స్ కింద ప్రస్తుతం మార్కెట్లో దాదాపు రూ. 10 వేలుగా ఉన్న క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టుల ధరను ఏకంగా 10 రెట్లకుపైగా లేదా 90 శాతం తగ్గించి రూ. 1000 లోపే (రూ. 999) తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది.
>> జినోమిక్ సైన్స్ అంటే.. లాలాజలం, రక్తం లేదా ఇతర శరీర కణజాలాల శాంపిల్స్ సేకరించి చేసే పరీక్ష. అంటే ఒక వ్యక్తి జన్యువులు, క్రోమోజోమ్స్ ఆధారంగా భవిష్యత్తులో వచ్చేటువంటి వ్యాధుల్ని ముందే గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ (సబ్సిడరీ) స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ రూపొందించిన.. క్యాన్సర్ స్పాట్ అనే ఏఐ మోడల్ ద్వారా.. 10 రకాల క్యాన్సర్లను ఎర్లీ స్టేజ్‌లోనే (ప్రారంభ దశలో) గుర్తించవచ్చు. లివర్, ప్యాంక్రియాటిక్, గాల్ బ్లాడర్ రొమ్ము, ఉదర క్యాన్సర్లను గుర్తించొచ్చు.
సాధారణంగా 50 ఏళ్లు దాటిన 100 మందిలో ఒకరికి క్యాన్సర్ బయటపడితే.. ఈ టెస్ట్ ద్వారా పాజిటివ్ వచ్చిన వారిలో 20-30 మందికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధరణ అవుతుంది. దేశంలో ఏటా 15 లక్షలకుపైగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. దీంట్లో 80 శాతం కేసులు థర్డ్ స్టేజ్ లేదా ఫోర్త్ స్టేజ్‌లో గుర్తించడం వల్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు చౌక ధరలకే టెస్టుల్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి.. తక్కువ ఖర్చుతో చికిత్స పొందే వీలుంటుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్.. 2021లో బెంగళూరులోని స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్‌ను రూ. 393 కోట్లకు కొనుగోలు చేసింది. గత సంవత్సరం కార్కినోస్ హెల్త్ కేర్‌ను రూ. 375 కోట్లకు దక్కించుకుంది. వీటి ద్వారా వైద్య రంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఈ సంవత్సరం రిలయన్స్ వార్షిక సమావేశంలో కూడా ముకేశ్ అంబానీ దీని గురించి మాట్లాడారు. జినోమిక్స్ విప్లవం ద్వారా.. మానవుడి సగటు ఆయుర్దాయం పెంచడం, వ్యాధుల్ని నయం చేసే విధానంలో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
Latest News