|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 07:09 PM
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో దివ్య ఔషధ వనం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తిరుమల కొండలకు మరో మణిహారంగా ఉండేలా ఈ దివ్య ఔషధ వనం ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఔషధ మొక్కల సంరక్షణే ముఖ్య ఉద్దేశంతో టీటీడీ ఈ దివ్య ఔషధ వనం ఏర్పాటు చేయనుంది. రూ.4.25 కోట్లతో 3.90 ఎకరాల్లో దివ్య ఔషధ వనం ఏర్పాటుచేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అంతరించిపోతున్న, అరుదైన ఔషధ మొక్కలకు నిలయంగా దివ్య ఔషధ వనం అభివృద్ధి చేస్తామని టీటీడీ వెల్లడించింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో శేషాచలం అడవులకు జీవనాడిగా దివ్య ఔషధ వనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ దివ్య ఔషధ వనం ద్వారా ఓవైపు అరుదైన, అంతరించిపోతున్న ఔషధ మొక్కలను సంరక్షిస్తూనే.. ప్రజలకు వాటిని పరిచయం చేయవచ్చని టీటీడీ భావిస్తోంది. దీని ద్వారా జీవ వైవిధ్య సంరక్షణతో పాటుగా.. పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని భావిస్తున్నారు. అలాగే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో పాటుగా.. ప్రకృతి ప్రేమికులు, పరిశోధకులు, విద్యార్థులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టీటీడీ భావిస్తోంది.
మరోవైపు ఈ దివ్య ఔషధ వనంలో.. సుగంధ వనం, పవిత్ర వనం, దేహ చికిత్స వనం, ప్రసాద వనం, జీవరాశి వనం, వంటి 13 రకాల ఇతివృత్తాలతో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తారు. తిరుమలలోని జీఎన్సీ టోల్ గేట్ సమీపంలో ఈ దివ్య ఔషధ వనం ఏర్పాటుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. టోల్ గేట్ సమీపంలోని దిగువ, ఎగువ ఘాట్ రోడ్లకు మధ్యలో4.25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 3.90 ఎకరాల స్థలంలో టీటీడీ ఈ దివ్య ఔషధ వనం అభివృద్ధి చేయనుంది.
దివ్య ఔషధ వనం ఏర్పాటులో భాగంగా జనవరిలో పనులు ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఔషధ మొక్కలను పెంచి, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. 2026 డిసెంబర్ నాటికి ఈ దివ్య ఔషధ వనం పూర్తిస్థాయిలో అందబాటులోకి తేవాలని టీటీడీ భావిస్తోంది. ఈ ఔషధ వనం ద్వారా అరుదైన మొక్కల సంరక్షణతో పాటుగా భవిష్యత్ తరాలకు వాటిపై అవగాహన కల్పించవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భావిస్తున్నారు.
Latest News