|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 08:10 PM
కేరళలోని తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో కలకలం రేగింది. స్మార్ట్ కళ్లజోడు పెట్టుకుని ఆలయంలోకి ప్రవేశించిన విదేశీ భక్తుడు.. దాని సాయంతో లోపలి రికార్డు చేసేందుకు ప్రయత్నించాడు. దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది అప్రమత్తమై.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. డిసెంబరు 20న శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో నిందితుడ్ని సింగపూర్‌లోని నార్త్‌షోర్ డ్రైవ్‌కు చెందిన తిరునీపనార్ (49)గా గుర్తించారు. తిరునీపనార్‌ను శ్రీలంక సంతతికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలోకి శనివారం ఉదయం 9.25 గంటల సమయంలో తిరునీపనార్ కెమెరా అమర్చిన స్మార్ట్ కళ్లజోడు ధరించి ప్రవేశించాడు. అనంతరం లోపల వీడియో రికార్డు చేయడం మొదలుపెట్టాడు. ఆలయ ఉత్తరంవైపు, తులాభారం మండపం, సహా ఇతర ప్రదేశాలను వీడియోలో బంధించాడు. అతడి చర్యలను గుర్తించిన సెక్యూరిటీ వెంటనే అలర్ట్ అయి అదుపులోకి తీసుకుంది. అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు. ఆలయ అధికారుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి నోటీసులు ఇచ్చి వదిలిపెట్టిన పోలీసులు.. డిసెంబర్ 21న విచారణకు రావాలని ఆదేశించారు.
శ్రీలంక సంతతికి చెందిన తిరునీపనార్ కేరళలో పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. అయితే, పద్మనాభస్వామి ఆలయంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది జులైలో గుజరాత్‌కు చెందిన సురేంద్ర షా అనే వ్యక్తి ఆలయం లోపలి వీడియో తీయడానికి ప్రయత్నించడంతో భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంతో కలిసి ఆలయ సందర్శనకు వచ్చిన అతడు స్మార్ట్ కళ్లజోడు పెట్టుకుని ప్రవేశించాడు. కాగా, 8వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో టన్నుల కొద్దీ బంగారం, వజ్రాలు, విగ్రహాలు 2011లో బయటపడటంతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆలయ నేలమాళిగలోని ఆరు గదుల్లో అపార సంపదలు బయటపడ్డాయి. అయితే, ఐదు గదులను తెరవగా.. ఆరో గది మాత్రం తెరవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ గది తలుపులపై నాగబంధనం ఉందని, తెరిస్తే అరిష్టమనే ప్రచారం కూడా జరిగింది.
Latest News