|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 09:24 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత విలేకర్ల ముందుకు వచ్చిన కేసీఆర్.. తెలంగాణలోని రేవంత్ సర్కారు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇదే క్రమంలో చంద్రబాబుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సీఎంగా చంద్రబాబు పనిచేసినప్పటి సంగతులపైనా కేసీఆర్ విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలోనే 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో కుదిరిన ఎంవోయూలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంవోయూలకు హైప్ క్రియేట్ చేయడంలో ఆద్యుడు చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు.
"బిజినెస్ మీట్లు పెడతారు. ఎంవోయూలు చేసుకోవడం ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందే. అయితే హైప్ క్రియేట్ చేసుకోవడం దేనికి. దీనికి ఆద్యుడు చంద్రబాబు. చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం ఎంవోయూలు వచ్చినట్లయితే.. ఏపీలో ఈపాటికే 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేవి. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు విశాఖలో పెట్టిన సదస్సులో ఎంవోయూలపై ఎవరు సంతకం పెట్టారంటే.. వంట మనషులు, స్టార్ హోటల్స్‌లో వంట మనుషులు, సప్లై చేసేవాళ్లతో సంతకాలు పెట్టించారు. ఆ పెట్టుబడులు అన్నీ ఎక్కడికి పోయాయి. రూ.10 లక్షల కోట్లు, ఆరు లక్షల కోట్లు అన్నారు..కనీసం రూ.10 వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు." అంటూ చంద్రబాబుపై కేసీఆర్ ఘాటు విమర్శలు చేశారు.
మరోవైపు విశాఖపట్నం వేదికగా ఇటీవల సీఐఐ భాగస్వామ్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో సుమారుగా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులకు వివిధ సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అనంతరం తెలంగాణ ప్రభుత్వం కూడా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరిట నిర్వహించిన సదస్సులో సుమారుగా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఎంవోయూలపై అతి ప్రచారం చేస్తున్నాయంటూ కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన సదస్సు ద్వారా ఏపీకి కనీసం రూ.10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రాలేదంటూ విమర్శించారు.
Latest News