|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 10:36 PM
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ.. 'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'లో భాగంగా ఇటీవల భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అర్జెంటినా ఆటగాడు.. కోల్‌కతా, హైదరాబాద్, ఢిల్లీల్లో పర్యటించాడు. అయితే మెస్సీతో సెల్ఫీ దిగడానికి రూ. 10 లక్షల చొప్పున వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా అతడిని ప్రత్యక్షంగా కలిసే అవకాశం కోసం పలువురు కార్పొరేట్ సంస్థల అధిపతులు, వీఐపీలు భారీ మొత్తాలను ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది. మెస్సీని కలిసి హ్యాండ్‌షేక్ చేసే అవకాశం కోసం కొందరు కార్పొరేట్లు ఏకంగా రూ.1 కోటి వరకు చెల్లించినట్లు వార్తలు వచ్చాయి. అయితే భారత్‌లో మూడు రోజులు పర్యటించినందుకు లియోనెల్ మెస్సీ రూ. 89 కోట్లు ఇచ్చారట నిర్వాహకులు. అయినా ఈ పర్యటనపై మెస్సీ అంసతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
మెస్సీని దగ్గరి నుంచి చూడాలని, ఆటను వీక్షించాలని కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే మెస్సీ మాత్రం మ్యాచ్ ఆడకుండానే అలా వచ్చి.. ఇలా స్టేడియం నుంచి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయాక అభిమానులు దూసుకొచ్చి.. టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేశారు. కోల్‌కతా స్టేడియంలో మెస్సీ ఈవెంట్ గందరగోళంగా మారడంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈవెంట్ మేనేజర్ శతద్రు దత్తాను అధికారులు విచారించగా.. మెస్సీ ఫీజు విషయం బయటపడింది. "మెస్సీకి రూ.89 కోట్లు ఇచ్చాము. ప్రభుత్వానికి రూ.11 కోట్ల ట్యాక్స్ కట్టాం. మొత్తం ఖర్చు రూ.100 కోట్లు. అయితే ఇందులో 30 శాతం ఖర్చు స్పాన్సర్ల నుంచి.. టికెట్ల అమ్మకాల ద్వారా మరో 30 శాతం లభించింది" అని శతద్రు దత్తా పేర్కొన్నాడు.
మెస్సీ అసంతప్తి..
సాల్ట్‌లేక్ స్టేడియంలో కొందరు తనను టచ్ చేయడం, హత్తుకోవడం మెస్సికి నచ్చలేదని శతద్రు దత్తా తెలిపాడు. దీనిపై మెస్సీ అసంతృప్తిగా ఉన్నట్లు చెప్పాడు. దీనికి గురించి అతడి సెక్యూరిటీ ముందు నుంచి చెప్పారని వెల్లడించాడు. ఒక అంతర్జాతీయ ప్లేయర్ పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదని దత్తా అధికారులతో అన్నాడు. మరోవైపు, శుక్రవారం దత్తా ఇంటిపై సిట్ అధికారులు దాడి చేశారు. పలు ముఖ్యమైన డాక్యుమెంట్లతో పాటు దత్తా అకౌంట్లో ఉన్న రూ.20 కోట్లు సిట్ అధికారులు ఫ్రీజ్ చేశారు. అయితే ఈ డబ్బులు కోల్‌కతా, హైదరాబాద్‌లో డికెట్లు అమ్మడం ద్వారా, స్పాన్సర్ల ద్వారా వచ్చినవి అని దత్తా పేర్కొన్నాడు. దత్తా చెప్పిన వివరాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Latest News