|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 10:46 PM
ప్రజలను పొదుపు వైపు మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలను అందిస్తోంది. ఈ స్కీమ్స్ పోస్టాఫీసు లేదా బ్యాంకుల్లో అందుబాటులో ఉంటాయి. అయితే, చాలా మంది పోస్టాఫీసుల ద్వారా ఆయా పథకాలను ఎంచుకుంటారు. అందులో ఒకటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం. దీనికి ప్రజల నుంచి మంచి ప్రజాదరణ లభిస్తోంది. అన్ని వయస్కుల వారికి ఈ స్కీమ్ అనువైంది. మంచి వడ్డీ రేటును అందించడమే కాకుండా,పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. చిన్న మొత్తాలతో పొదుపు ప్రారంభించి లాంగ్ టర్మ్‌లో పెద్ద మొత్తం అందుకోవచ్చు. పెట్టుబడిదారులకు రిస్క్ లేని, పన్ను మినహాయింపులు అందిస్తుంది.
పీపీఎఫ్ పథకం ద్వారా సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ ఇస్తోంది కేంద్రం. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ సమీక్షిస్తారు. అయితే గత 3 సంవత్సరాల నుంచి పీపీఎఫ్ వడ్డీని మార్చలేదు. అధిక పన్ను శ్లాబ్‌లో ఉన్న వారికి సైతం పీపీఎఫ్ వడ్డీపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద సైతం పన్ను మినహాయింపు లభిస్తుంది.
ఈ పథకానికి 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉండగా కనీసంగా సంవత్సరానికి రూ. 500తో అకౌంట్ ప్రారంభించవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. నెలకు రూ. 12,500 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి రూ. 1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా 15 సంవత్సరాలలో మొత్తం డిపాజిట్ రూ. 22,50,000 లక్షలు అవుతుంది.
ప్రస్తుత 7.1 శాతం వార్షిక వడ్డీ రేటుతో వడ్డీ మొత్తం రూ. 18,18,209 అవుతుంది. ఫలితంగా మెచ్యూరిటీ టైంలో చేతికి మొత్తం దాదాపు రూ. 40,68,209 అవుతుంది. మెచ్యూరిటీ అయిన 15 ఏళ్ల తర్వాత కొనసాగించాలనుకునే వారికి మరో సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఖాతాను పొడిగించుకోవచ్చు. ఎలాంటి పెట్టుబడి చేయకపోయినా ఖాతా పొడిగిస్తూ అధిక వడ్డీ పొందవచ్చు.
Latest News