|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 12:15 PM
ఇండియాకు సెలవులపై వచ్చిన వేలమంది H-1B వీసా హోల్డర్లకు అమెరికా ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా వెట్టింగ్ నిబంధనలను కఠినతరం చేస్తూ తీసుకున్న నిర్ణయంతో వీసా ఇంటర్వ్యూ ప్రక్రియ ఒక్కసారిగా స్తంభించిపోయింది. డిసెంబర్ 15 నుండి జరగాల్సిన వేలమంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల అపాయింట్‌మెంట్లను యూఎస్ కాన్సులేట్లు ఒక్కసారిగా రద్దు చేశాయి. దీంతో స్వదేశానికి వచ్చిన టెక్కీలు తిరిగి అమెరికా వెళ్లలేక అనిశ్చితిలో పడిపోయారు.
అపాయింట్‌మెంట్లు రద్దు కావడమే కాకుండా, తదుపరి తేదీలను ఏకంగా వచ్చే ఏడాది జులై నెలకు రీషెడ్యూల్ చేయడం ఐటీ ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. డిసెంబర్‌లో పనులు ముగించుకుని తిరిగి వెళ్దామనుకున్న వారు ఇప్పుడు ఆరు నెలల పాటు ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు, అక్కడ ఇళ్లు అద్దెకు తీసుకున్న వారు ఆర్థికంగా భారీగా నష్టపోతున్నారు. ఏం చేయాలో పాలుపోక కాన్సులేట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఈ ఆకస్మిక పరిణామాల వల్ల ఐటీ నిపుణులు తమ అమెరికా ఆఫీసుల నుండి అన్‌పెయిడ్ లీవ్స్ (జీతం లేని సెలవులు) తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మరికొందరు ఇక్కడి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పటికీ, లాంగ్ టర్మ్ ప్రాజెక్టులకు ఇది ఆటంకంగా మారింది. ఒకవేళ జులై వరకు వీసా రాకపోతే ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో అన్న భయం వారిని వెంటాడుతోంది. కుటుంబాలతో సహా ఇండియా వచ్చిన వారు పిల్లల స్కూళ్లు, ఇతర బాధ్యతల విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు, ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలతో అమెరికాలోని దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా టెన్షన్ పడుతున్నాయి. తమ కీలక ఉద్యోగులు సకాలంలో తిరిగి రాకపోవడంతో ప్రాజెక్టులు ఆగిపోయే ప్రమాదం ఉందని కంపెనీలు వాపోతున్నాయి. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా వీసాలను నిలిపివేయడం వల్ల టాలెంట్ ఉన్న నిపుణులు దూరం అవుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అటు ఉద్యోగులు, ఇటు యాజమాన్యాలు ఈ సంక్షోభం నుండి ఎప్పుడు బయటపడతామా అని ఎదురుచూస్తున్నాయి.