|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:08 PM
పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మత రాజకీయాలు మొదలయ్యాయి. టీఎంసీ నేతలు మందిర్- మసీద్ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ మండిపడుతోంది. బాబ్రీ మసీదు కూల్చివేత, అయోధ్య బాలరాముడి ఆలయ నిర్మాణం నేపథ్యంలో ముర్షిదాబాద్ లో బాబ్రీ మసీదును నిర్మిస్తానని టీఎంసీ నేత హుమాయున్ కబీర్ ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటనతో హుమాయున్ పై మండిపడ్డ టీఎంసీ అధిష్ఠానం.. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. అయినప్పటికీ మసీదు నిర్మాణం విషయంలో వెనక్కి తగ్గేదిలేదని కబీర్ ప్రకటించారు.విరాళాల కోసం ఆయన ఇచ్చిన పిలుపుకు ముస్లిం కమ్యూనిటీ నుంచి భారీ స్పందన లభించింది. ఇదిలా ఉండగా.. బాబ్రీ మసీదు నిర్మాణ ప్రకటన తర్వాత తాజాగా ముర్షిదాబాద్ జిల్లా జంగీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ తన నియోజకవర్గంలో కృష్ణ దేవాలయాన్ని నిర్మిస్తానని ప్రకటించారు. తన నియోజకవర్గంలో మత సామరస్యానికి ప్రతీకగా రూ. కోటి వెచ్చించి ఆలయం నిర్మిస్తానని తెలిపారు. ముస్లిం వర్గానికి చెందిన ఎమ్మెల్యే హిందూ దేవాలయం నిర్మిస్తానని చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది.
Latest News