|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:30 PM
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఒక అరుదైన, ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. డిగ్రీ పరీక్షలు రాస్తున్న ఓ గర్భిణికి పరీక్షా కేంద్రంలోనే నొప్పులు రావడంతో, అక్కడి సిబ్బంది సాయంతో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బేగుసరాయ్ జిల్లా మల్పూర్ గ్రామానికి చెందిన రవిత కుమారి భరద్వాజ్ కాలేజీలో బీఏ చదువుతోంది. శనివారం థాటియా గ్రామంలోని శశి కృష్ణ కాలేజీలో ఎకనామిక్స్ పేపర్ రాసేందుకు ఆమె హాజరైంది. పరీక్ష జరుగుతున్న సమయంలోనే ఆమెకు ప్రసవ వేదన మొదలైంది.ఆమె పరిస్థితిని గమనించిన పరీక్ష విధుల్లో ఉన్న మహిళా సిబ్బంది వెంటనే స్పందించారు. ఆమెను ఒక ఖాళీ గదిలోకి తీసుకెళ్లారు. కాలేజీ యాజమాన్యం అంబులెన్స్‌కు సమాచారం అందించినప్పటికీ, అది వచ్చేలోపే మహిళా సిబ్బంది రవితకు ప్రసవం చేశారు. పరీక్ష గదిలోనే శిశువు ఏడుపు వినిపించడంతో తోటి విద్యార్థులు, స్టాఫ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.అనంతరం అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌లో తల్లీబిడ్డలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ ఆరోగ్యంగా, నిలకడగా ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిండు గర్భిణి అయినప్పటికీ, చదువుపై ఉన్న మక్కువతో పరీక్షలకు హాజరైన రవిత కుమారి ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు.
Latest News