|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:31 PM
1971లో పాకిస్థాన్ చెర నుంచి విముక్తి కలిగించి, బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. నాటి రక్తపాత యుద్ధంలో భారత సైన్యం చేసిన త్యాగాల ఫలితంగానే ఆ దేశం స్వతంత్ర గడ్డపై నిలబడగలిగింది. అయితే, దశాబ్దాల తర్వాత ఇప్పుడు పరిస్థితులు తలకిందులవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు భారత్ అండతో ఎదిగిన దేశం, నేడు అదే భారత్‌కు వ్యతిరేకంగా అడుగులు వేయడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్ వ్యవహారశైలిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కనుసన్నల్లో మెలుగుతున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాక్ సైనిక నాయకత్వం అందించే వ్యూహాలను అమలు చేస్తూ, భారత్‌తో ఉన్న సంబంధాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామం దక్షిణాసియాలో వ్యూహాత్మక మార్పులకు దారితీస్తోంది.
ముఖ్యంగా ఈ ఏడాది జూలైలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘భారత్‌కు తూర్పు వైపు నుంచి సవాళ్లు మొదలుపెడతాం’ అని ఆయన ఇచ్చిన హింట్, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అలజడులకు ముందే సంకేతంగా నిలిచింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచడం ద్వారా భారత్‌ను రెండు వైపుల నుంచి ఒత్తిడిలోకి నెట్టాలని పాక్ పన్నాగం పన్నుతోంది. దీనికి బంగ్లాదేశ్‌ను వేదికగా వాడుకోవడం గమనార్హం.
మరోవైపు, బంగ్లాదేశ్‌లో అతివాద మరియు ఇస్లామిక్ శక్తులు వేగంగా బలపడుతున్నాయి. భారత్‌కు అనుకూలంగా ఉండే శక్తులను అణచివేస్తూ, మతోన్మాద పార్టీలు అధికారం వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ అతివాద పార్టీలు పాకిస్థాన్‌తో చేతులు కలిపి భారత్ వ్యతిరేక కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇది మన దేశ అంతర్గత భద్రతకు మరియు ఈశాన్య రాష్ట్రాల శాంతికి పెద్ద సవాలుగా మారనుంది.