|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 02:39 PM
ఆరావళి పర్వత శ్రేణుల్లో మైనింగ్ కార్యకలాపాల కోసం నిబంధనలు మార్చారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక వివరణ ఇచ్చింది. ఈ విషయంపై వస్తున్న వార్తలు వాస్తవం కాదని, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. ఆరావళి ప్రాంతంలోని సహజ వనరులను కాపాడుతూనే, చట్టబద్ధమైన నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నామని కేంద్రం పేర్కొంది.
ఆరావళి పర్వతాల నిర్వచనాన్ని మార్చి మైనింగ్ మాఫియాకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఆరావళి విస్తీర్ణంలో 90 శాతానికి పైగా భూభాగం ఇప్పటికీ రక్షిత ప్రాంతంగానే కొనసాగుతుందని ఆయన వివరించారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
గణాంకాలను పరిశీలిస్తే, ఆరావళి పర్వత శ్రేణులు మొత్తం 1.44 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇందులో కేవలం 0.19 శాతం పరిధిలో మాత్రమే తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. అతి తక్కువ విస్తీర్ణంలో జరుగుతున్న ఈ మైనింగ్ కార్యకలాపాలు కూడా పర్యావరణ నిబంధనలకు లోబడి, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే సాగుతున్నాయని కేంద్రం వివరించింది.
పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసేలా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని, ఆరావళి పర్వతాల సహజత్వాన్ని కాపాడటం తమ బాధ్యతని మంత్రి పునరుద్ఘాటించారు. అటవీ ప్రాంతాల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తూనే, దేశాభివృద్ధికి అవసరమైన కనిజ సంపద వినియోగంపై దృష్టి సారించామన్నారు. అపోహలకు తావులేకుండా పారదర్శకమైన విధానాలను అమలు చేస్తున్నామని, పర్యావరణ పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది.