|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 05:26 PM
ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. 'ఇందుగలడందులేడని సందేహము వలదు' అన్న చందంగా ప్రతి చోటా తమ ఉచ్చును బిగిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని, క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామనే ఆశ చూపి కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. గతంలో కంటే భిన్నంగా, అత్యంత నమ్మశక్యంగా మాట్లాడుతూ అమాయక ప్రజలను తమ బుట్టలో వేసుకుంటున్నారు.
ఈ మోసగాళ్లు ప్రధానంగా ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ (SMS), మరియు వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా బాధితులను సంప్రదిస్తారు. తాము ఫలానా ప్రముఖ బ్యాంకు నుంచి లేదా క్రెడిట్ కార్డు జారీ చేసిన సంస్థ ప్రతినిధులమని పరిచయం చేసుకుంటారు. మీ కార్డు వినియోగం చాలా బాగుందని, అందుకే కంపెనీ మీకు రివార్డు పాయింట్లు లేదా ఉచితంగా లిమిట్ పెంచే అవకాశం కల్పించిందని నమ్మబలుకుతారు. వారి మాటలు ఎంత చాకచక్యంగా ఉంటాయంటే, సామాన్యులు అది నిజమైన కాల్ అని సులభంగా నమ్మేస్తారు.
మాటల్లో పెట్టి నెమ్మదిగా మీ కార్డుపై ఉన్న పదహారు అంకెల సంఖ్య, గడువు ముగిసే తేదీ (Expiry Date) వంటి వివరాలను సేకరిస్తారు. ఆ తర్వాత అసలైన ఘట్టానికి తెరలేపుతారు. వెరిఫికేషన్ కోసం అంటూ మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ (OTP)ని చెప్పమని అడుగుతారు. ఒకవేళ మీరు అనుమానిస్తే, ఇది కేవలం సెక్యూరిటీ చెక్ మాత్రమేనని బుజ్జగిస్తారు. మీ కార్డు వెనుక ఉండే సీవీవీ (CVV) నంబర్‌ను కూడా తెలివిగా లాగి, మీ వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని పూర్తిగా తమ హస్తగతం చేసుకుంటారు.
చివరి ప్రయత్నంగా, లిమిట్ పెంచే ప్రక్రియ పూర్తి కావాలంటే కొద్దిపాటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని కోరుతూ ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ క్లిక్ చేయగానే మీ ఫోన్ లేదా కంప్యూటర్ వారి నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఒక్కసారి మీరు ఆ లింక్ ద్వారా లావాదేవీ చేస్తే, క్షణాల్లో మీ ఖాతాలోని సొమ్మంతా మాయమైపోతుంది. అందుకే తెలియని వ్యక్తులు పంపే లింక్‌ల పట్ల, ఓటీపీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.