|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 09:49 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. నార్త్ కరోలినాలో నిర్వహించిన మధ్యంతర ఎన్నికల ర్యాలీలో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భార్య మెలానియా లోదుస్తుల గురించి మాట్లాడటంతో అందరూ షాకయ్యారు. ఆర్థిక అంశాలపై మాట్లాడాల్సింది పోయి.. 2022లో తన ఫ్లోరిడా నివాసంపై జరిగిన FBI దాడుల గురించి అమెరికా అధ్యక్షుడు ప్రస్తావించారు. ఫెడరల్ ఏజెంట్లు తన భార్య మెలానియా ట్రంప్ గదిలోకి వెళ్లి ఆమె అల్మారాలు, వార్డ్‌రోబ్‌లను చిందరవందర చేశారని ట్రంప్ ఆరోపించారు. మెలానియా తన వార్డ్‌రోబ్‌ను ఎంతో చక్కగా సర్దుకుంటుందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఆమె చాలా జాగ్రత్త మనిషి, ప్రతిదీ పరిపూర్ణంగా ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
‘ఆమె చేసిన ప్రతిదీ పరిపూర్ణంగా ఉంటుంది. లోదుస్తులు, కొన్నిసార్లు ప్యాంటీలు అని పిలుస్తారు.. అవి చక్కగా మడతపెట్టి, చుట్టి ఉంటాయి. అవి చాలా పరిపూర్ణంగా ఉంటాయి. ఆమె వాటిని ఆవిరిలో శుభ్రం చేస్తుందని నేను అనుకుంటున్నాను’ అని ఆయన అన్నారు. ట్రంప్ మొదటిసారి అధ్యక్ష పదవీకాలం ముగిసి వైట్‌హౌస్‌ను విడిచిపెట్టిన తర్వాత అదికారిక రహస్య పత్రాలను తన వెంట తీసుకెళ్లారనే ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా ఆగస్టు 2022లో ఎఫ్‌బీఐ సోదాలు జరిపింది. ట్రంప్ నివాసంలో ఎఫ్బీఐ సోదాలను రాజకీయ ప్రేరేపితమని ట్రంప్ పదేపదే విమర్శించారు.
ఫిబ్రవరి 2022లో నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ (NARA) మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ మార్-ఎ-లాగో నుంచి 15 పెట్టెల్లో అధికారిక పత్రాలను తీసుకువెళ్లినట్లు గుర్తించామని తెలిపింది. నారా ప్రకారం.. ట్రంప్ తన పదవీకాలం ముగిసి వైట్ హౌస్ నుంచి నిష్క్రమించినప్పుడు ఈ రికార్డులను ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సి ఉంది. కానీ, ఆయన అలా చేయకుండా తన వెంట తీసుకెళ్లారు.
వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. ట్రంప్ తన ర్యాలీలో గ్యాస్, ఆరోగ్య సంరక్షణ వంటి నిత్యావసరాల ధరలను తగ్గించే ప్రణాళికలను వివరించారు. తన పాలనలో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నామని, దీనికి బైడెన్ పరిపాలనే కారణమని ఆయన ఆరోపించారు. డెమొక్రటిక్ సెనేట్ అభ్యర్థి రాయ్ కూపర్‌ను ‘రాడికల్ లెఫ్ట్’, ‘విపత్తు’ అని ట్రంప్ అభివర్ణించారు. నేరాల విషయంలో పట్టించుకోలేదని, ఇటీవల వాయువ్య కరోలినాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు నెమ్మదిగా సాగడానికి ఆయన్నే బాద్యుడ్ని చేశారు.
తన పాలనలో నార్త్ కరోలినా సాధించిన విజయాలను ప్రశంసించుకుంటూ.. మిగతా సమస్యలను జో బైడెన్‌పై నెట్టేశారు. రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నార్త్ కరోలినా 53,000 ఉద్యోగాలను సృష్టించామని, అందులో 8,000 నిర్మాణ రంగంలో ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే, గవర్నర్ జోష్ స్టెయిన్ జనవరి నుంచి 33,000 ఉద్యోగాలు మాత్రమే కల్పించినట్టు నివేదించడం గమనార్హం. తన రెండో పదవీకాలం మొదటి ఏడాది ‘చరిత్రలో ఏ అధ్యక్షుడికి సాధ్యం కాని అత్యంత విజయవంతమైన సంవత్సరం’ అని పేర్కొన్నారు. ఔషధ ధరలు తగ్గింపు చర్చలు, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి కృషిచేశానని, మరిన్ని ఉద్యోగాలను సృష్టించడం వంటి విజయాలను ఆయన ఎత్తి చూపారు.
Latest News