|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 03:07 PM
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునే విధంగా ప్రణాళికలకు రూపకల్పన చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు 100 శాతం భద్రతకు భరోసా ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా సురక్షితమన్న భావన పర్యాటకుల్లో కలిగేలా చూడాలని అన్నారు. అందుకోసం టూరిజం సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు సంతోషంగా తిరిగి వెళ్లాలని, ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ తరలి వచ్చినప్పుడు వారికి భద్రమైన పరిస్థితులు కల్పించాలని, మహిళా పర్యాటకుల భద్రతకు ప్రత్యేక విధానం తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, ఉపాధి కల్పనపై పర్యాటక, దేవాదాయ, ఆర్ అండ్ బి శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ప్రత్యక్షంగా పాల్గొనగా, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.
Latest News