|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 03:09 PM
క్రీస్తు త్యాగాలను స్మరిస్తూ ఆయన చూపిన బాటను అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. క్రైస్తవులకు సంక్షేమం, ఆర్థిక చేయూత అందించింది తమ ప్రభుత్వమేనని అన్నారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. క్రిస్మస్ కేట్ కట్ చేసి మత పెద్దలకు తినిపించారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... "క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఏసు ప్రభువు ఈ లోకంలో జన్మించిన రోజును మనం క్రిస్మస్ గా జరుపుకుంటాం. ప్రపంచంలో జరిగే అతిపెద్ద పండుగ క్రిస్మస్. మేరీ మాత కడుపున ఏసు ప్రభువు జన్మించిన పవిత్రమైన రోజు మన అందరికీ పండుగైంది. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువలను అందించిన ఏసు సందేశం ఎప్పటికీ మార్గదర్శకం. క్రీస్తు బోధనల్ని ఆయన చూపిన బాటను అంతా అనుసరించాలి. పశువుల పాకలో పుట్టి... గొర్రెల కాపరిగా పెరిగిన ప్రజా రక్షకుడు ఏసు. నమ్మిన సిద్దాంతం కోసం బలి దానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పదనం నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలి. ప్రభువు తాగ్యాన్ని స్మరించుకోవాలి. శాంతి మార్గాన్ని అనుసరించాలి. ప్రేమ తత్వాన్ని పెంచాలి. ఈర్ష్య, ద్వేషాలకు దూరంగా ఉండి పాపులను సైతం క్షమించాలని బైబిల్ చెబుతోంది" అని ముఖ్యమంత్రి అన్నారు.
Latest News