|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 08:27 PM
దేశవ్యాప్తంగా పలువురు ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు తాజాగా ఆదాయపు పన్ను శాఖ నుంచి ఒక మెసేజ్ వస్తోంది. అందులో ITR on Hold అని పేర్కొంటూ, రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఐటీ రిటర్న్ రిఫండ్ క్లెయిమ్‌లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం ఇస్తున్నారు.ఈ మెసేజ్‌లతో ఒక్కసారిగా పన్ను చెల్లింపుదారులు అయోమయానికి గురవుతున్నారు. కొన్ని లోపాల కారణంగా రిటర్న్‌లు ప్రాసెస్ కాకుండా ఆపివేశామని తెలియజేస్తూ వస్తున్న సందేశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలోనూ ఇదే అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది.సక్రమంగా పన్నులు చెల్లిస్తున్న వారికి కూడా ఈ తరహా అలర్ట్ మెసేజ్‌లు అందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విరాళాలు, విదేశీ ఆస్తులు, డీమ్యాట్ హోల్డింగ్‌లు లేదా అధిక రిఫండ్ క్లెయిమ్ చేసిన వారికి ఇలాంటి హెచ్చరికలు సాధారణంగా వస్తున్నాయని తెలుస్తోంది. అర్ధరాత్రి వేళల్లో అలర్ట్‌లు రావడం, సంబంధిత ఈ-మెయిల్స్ అందకపోవడం వల్ల గందరగోళం మరింత పెరుగుతోందని పన్ను చెల్లింపుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఐటీ శాఖపై అసహనం వ్యక్తమవుతోంది.అయితే, అదనపు తనిఖీల కోసం మాత్రమే కొన్ని రిటర్న్‌లను ఐటీ శాఖ హోల్డ్‌లో పెట్టినట్లు మరికొందరు చెబుతున్నారు. ప్రస్తుతం వస్తున్న మెసేజ్‌లు నోటీసులు కాదని, కేవలం అప్రమత్తం చేసే అలర్ట్‌లు మాత్రమేనని వారు స్పష్టం చేస్తున్నారు. ముందుజాగ్రత్తగా రిటర్న్‌లను సమీక్ష కోసం ఎంపిక చేశామని, అవసరమైతే డిసెంబర్ 31లోగా సవరించిన రిటర్న్ దాఖలు చేయాలని సూచిస్తున్నారు. ఈ విషయమై సమగ్ర వివరాలతో ఈ-మెయిల్స్ పంపుతున్నామని ఐటీ శాఖ చెబుతున్నప్పటికీ, అవి చాలా మందికి చేరలేదని సమాచారం.ఇలాంటి మెసేజ్‌లు వచ్చిన పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ను మరోసారి జాగ్రత్తగా పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి క్లెయిమ్‌కు సంబంధించిన సరైన పత్రాలు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. ఏదైనా పొరపాటు జరిగి ఉంటే, డిసెంబర్ 31లోగా సవరించిన రిటర్న్ దాఖలు చేయాలి. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అలాగే, ఏఐఎస్ మరియు ఫారం 26ASలో ఏవైనా వ్యత్యాసాలు ఉన్నాయా అని తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ముఖ్యంగా అధిక విలువ గల లావాదేవీల విషయంలో సరైన ఏఐఎస్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం అవసరమని సూచిస్తున్నారు.
Latest News