|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:26 PM
ఫుట్‌బాల్ ప్రపంచంలో దశాబ్దాలుగా సాగుతున్న ఆధిపత్య పోరులో మరోసారి లియోనెల్ మెస్సీ తన చిరకాల ప్రత్యర్థి క్రిస్టియానో రొనాల్డోపై పైచేయి సాధించాడు. 2025 క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మెస్సీ ముందు నిలిచాడు. గతేడాది మొత్తం మీద మెస్సీ 46 గోల్స్ చేయగా, రొనాల్డో 41 గోల్స్‌తో సరిపెట్టుకున్నారు.వివరాల్లోకి వెళ్తే, లియోనెల్ మెస్సీ అమెరికాలోని తన క్లబ్ 'ఇంటర్ మయామి' తరఫున 43 గోల్స్, తన దేశం అర్జెంటీనా తరఫున 3 గోల్స్ సాధించాడు. మరోవైపు, క్రిస్టియానో రొనాల్డో సౌదీ అరేబియా క్లబ్ 'అల్-నసర్' కోసం 33 గోల్స్, పోర్చుగల్ జాతీయ జట్టుకు 8 గోల్స్ అందించాడు. రొనాల్డో గోల్స్ సంఖ్యపై కొన్ని నివేదికల్లో 40 అని పేర్కొన్నప్పటికీ, చాలా క్రీడా సంస్థలు ఆయన 41 గోల్స్ చేసినట్లు నిర్ధారించాయి.కేవలం గోల్స్ చేయడమే కాకుండా, గోల్స్ చేయించడంలోనూ (అసిస్ట్‌లు) మెస్సీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 2025లో మెస్సీ ఏకంగా 28 అసిస్ట్‌లు అందించగా, రొనాల్డో కేవలం 4 అసిస్ట్‌లతో వెనుకబడ్డాడు. అయితే, రొనాల్డో తన కెరీర్‌లో ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 40కి పైగా గోల్స్ చేయడం ఇది 14వ సారి కావడం విశేషం.
Latest News