|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 09:04 PM
సిగరెట్లు, బీడీలు తాగే అలవాటు మీకు ఉందా? అయితే ఇకపై వాటిపై ఖర్చు పెట్టే బడ్జెట్ గణనీయంగా పెరగనుంది. కారణం ఏమిటంటే… త్వరలో సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి.పొగాకు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీతో పాటు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీనికి సంబంధించి ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల్లో ఎక్సైజ్ బిల్లుకు ఆమోదం లభించడంతో ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఏర్పడింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీంతో ఫిబ్రవరి నుంచి సిగరెట్లు, బీడీల ధరలు ఆకాశాన్నంటనున్నాయి. ఇక సిగరెట్ తాగాలంటే గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం ప్రస్తుతం ఉన్న 25 శాతం నుంచి 100 శాతానికి పెరగనుంది. సిగరెట్లపై వెయ్యి కర్రలకు రూ.200 నుంచి రూ.735 వరకు ఎక్సైజ్ సుంకం పెరుగుతుందని అంచనా. సిగరెట్ రకం, పొడవును బట్టి మొత్తం ధర రూ.2,700 నుంచి రూ.11 వేల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. దీని ప్రభావంతో సిగరెట్లు, సిగార్లు, గుట్కా, నమిలే పొగాకు వంటి ఉత్పత్తుల ధరలు ఊహించని స్థాయిలో పెరగనున్నాయి.ఇక నమిలే పొగాకుపై పన్నులు 25 శాతం నుంచి 100 శాతం వరకు, గుట్కా మరియు ఇతర పొగాకు ఉత్పత్తులపై 25 శాతం నుంచి 40 శాతం వరకు పెరుగుతాయి. అలాగే ధూమపానం కోసం ఉపయోగించే పైపులు, పొగాకు మిశ్రమాలపై పన్ను రేట్లు 60 శాతం నుంచి ఏకంగా 300 శాతం వరకు పెరగనున్నాయి.జీఎస్టీ, ఎక్సైజ్ సుంకం పెంపు కారణంగా ప్రస్తుతం రూ.18గా ఉన్న ఒక్క సిగరెట్ ధర రూ.72కు చేరవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో సిగరెట్ తాగాలంటే ఇక రెండుసార్లు కాదు… పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు ఒక్క సిగరెట్ ధర రూ.20లోపే ఉండటంతో చాలామంది తక్కువ ఖర్చుతోనే ఈ అలవాటును కొనసాగిస్తున్నారు. కొందరు కొత్తగా అలవాటు కూడా చేసుకుంటున్నారు.అయితే తాజా ధరల పెంపుతో సిగరెట్ తాగడం ఖరీదైన వ్యవహారంగా మారనుంది. దీనివల్ల కొందరు ఈ అలవాటును మానుకునే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఎక్సైజ్ సుంకం, జీఎస్టీ రేట్లు అమల్లోకి రానుండటంతో సిగరెట్ తయారీ కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి మొదటి తేదీ నుంచే మారిన సిగరెట్ ధరలు మార్కెట్లో కనిపించనున్నాయి.
Latest News