|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 09:33 PM
ఇరాన్‌లో ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుప్రీం నేత ఆయుతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన ఆందోళనలు తీవ్రమైన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిచారు. శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తోన్నవారి ప్రాణాలు తీయొద్దని ఇరాన్‌ను హెచ్చరించారు. అమెరికా వారిని రక్షించడానికి వస్తుందని, అందుకు మేము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. డిసెంబరు 27న వర్తక సంఘాలు ప్రారంభించిన ఆందోళనలు క్రమంగా ఉద్ధృతమై నగరాలు, పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించాయి. ఈ క్రమంలో గురువారం భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 100 మందికిపైగా గాయపడ్డారు.
‘‘ఇరాన్ శాంతియుత నిరసనకారులపై కాల్పులు జరిపి హింసించడం అది వారి ఆచారం.. కానీ, అమెరికా వారిని రక్షించడానికి వస్తుంది.. మేము పూర్తిగా సిద్ధమయ్యాం.. బయలుదేరడానికి సిద్ధమయ్యాం.. ఈ అంశంపై మీరు దృష్టిపెట్టినందుకు ధన్యవాదాలు’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు.
అమెరికన్ డాలర్‌తో ఇరాన్ రియాద్ మారకపు విలువ సగానికి పడిపోవడం, నిత్యావసరాల ధరలు కొండెక్కడం, ద్రవ్యోల్భణం పెరుగుదలతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీంతో డిసెంబరు 27న ఇరాన్ రాజధాని టెహ్రాన్ వర్తక సంఘాలు నిరసనలు మొదలుపెట్టాయి. రెండు రోజుల్లో ఈ ఆందోళనలు ఇరాన్ మొత్తం వ్యాపించాయి. అనేక నగరాల్లో విద్యార్తులు, సామాన్యులు భారీగా వీధుల్లోకి రావడంతో ఉద్యమం తీవ్రమైంది. చివరకు జనవరి 1న హింసాత్మకంగా మారి.. పలువురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఆందోళలపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ స్పందించారు. ప్రజాగ్రహాన్ని అంగీకరిస్తున్నామని, వారి చట్టబద్ధమైన డిమాండ్లను తాను వింటానని హామీ ఇచ్చారు, అదే సమయంలో అస్థిరతను సృష్టించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక, అధికారులు కూడా ఆర్థిక, భద్రతా సర్దుబాట్లు చేశారు. కేంద్ర బ్యాంకు కొత్త చీఫ్‌ను నియమించారు. ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.