|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:24 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆరోగ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని స్పష్టం చేశారు. అయితే వైద్యులు సూచించిన మోతాదుకన్నా ఎక్కువగా తాను ఆస్పిరిన్ తీసుకుంటున్నానని తెలిపారు. వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు.ట్రంప్ ఆరోగ్యంపై గతంలో సోషల్ మీడియాలో అనేక పుకార్లు షికారు చేశాయి. కొంతకాలం ఆయన బహిరంగంగా కనిపించకపోవడం, కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ‘ట్రంప్ మిస్సింగ్’ అంటూ ప్రచారం కూడా చేశారు. అలాగే ఆయన చేతులు, కాళ్లపై గాయాలు కనిపించడంతో వాటిని కవర్ చేసేందుకు మేకప్ వేసుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. దీనిపై అప్పట్లో స్పందించిన ట్రంప్, తన జీవితంలో ఇప్పటి వరకు ఇంత ఆరోగ్యంగా ఎప్పుడూ లేనని చెప్పడంతో ఆ పుకార్లకు తెరపడింది.తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆరోగ్యంపై ట్రంప్ మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా తాను ఆస్పిరిన్ టాబ్లెట్లు తీసుకుంటున్నానని, అయితే, డాక్టర్లు రోజుకు 81 మిల్లీగ్రాములు సూచిస్తే తాను మాత్రం 325 మిల్లీగ్రాములు తీసుకుంటున్నానని తెలిపారు. రక్తాన్ని పలుచగా ఉంచడంలో ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. తన గుండెలో చిక్కటి రక్తం ప్రవహించడం తనకు ఇష్టం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇటీవల వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమాల్లో తాను వినికిడి సమస్యలు ఎదుర్కొంటున్నానని, తరచూ నిద్రపోతున్నానని వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన ఖండించారు. తన ఆరోగ్యం గురించి పదే పదే మాట్లాడుతుండటం తనకు ఇబ్బందిగా ఉందన్నారు.
Latest News