|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:37 PM
దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్ర సృష్టించిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ఘన నివాళి అర్పించారు. మహిళలను విద్యావంతులుగా చేయాలనే లక్ష్యంతో ఆనాడు సమాజ కట్టుబాట్లను ధిక్కరించి ఆమె చేసిన సాహసం నేటి ఆధునిక మహిళా శక్తికి బలమైన పునాదిగా నిలిచిందని పేర్కొన్నారు.సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం మహిళల విద్యకే పరిమితం కాకుండా, పురుషులకన్నా మిన్నగా అవకాశాలను సద్వినియోగం చేసుకునే స్థాయికి మహిళలను తీసుకొచ్చిందని చంద్రబాబు తెలిపారు. ఆమె చూపిన దారిలోనే నేటి మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తున్నారని అభిప్రాయపడ్డారు.సమాజంలో సగభాగమైన మహిళల విద్యాభివృద్ధిలో సావిత్రిబాయి పూలే కీలక పాత్ర పోషించారని సీఎం గుర్తు చేశారు. అందుకే ఆధునిక మహిళలు ఆమెకు సదా కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళా విద్యకు వెలుగులు నింపిన సావిత్రిబాయి పూలేకు మరోసారి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ట్వీట్‌లో తెలిపారు.
Latest News