సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్.. పోలీసుల కాల్పుల్లో 14 మంది నక్సలైట్లు మృతి
 

by Suryaa Desk | Sat, Jan 03, 2026, 08:54 PM

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లో భద్రతా దళాలు మావోయిస్టులపై మరోసారి ఉక్కుపాదం మోపాయి. శనివారం ఉదయం సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎదురుకాల్పుల్లో మొత్తం 14 మంది మావోయిస్టులు హతమయ్యారు. 2026 కొత్త ఏడాదిలో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన తొలి భారీ ఎన్‌కౌంటర్ ఇదే కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు సమీపిస్తున్న వేళ.. ఈ ఆపరేషన్ మావోయిస్టు వర్గాల్లో కలకలం రేపుతోంది.


సుక్మాలో క్లీన్ స్వీప్.. అగ్రనేత మృతి


శనివారం తెల్లవారుజాము నుంచే సుక్మా జిల్లాలోని దక్షిణ ప్రాంత అడవుల్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు సాగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మరణించారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి 'మంగ్దూ' ఉన్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు. కొంటా ఏరియా కమిటీలోని సాయుధ బలగాలన్నీ ఈ కాల్పుల్లో తుడిచి పెట్టుకుపోయాయని ఆయన వెల్లడించారు. ఇది ఆ ప్రాంతంలో మావోయిస్టు నెట్‌వర్క్‌కు కోలుకోలేని దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.


మరోవైపు పక్కనే ఉన్న బీజాపూర్ జిల్లాలో ఉదయం 5 గంటల ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇక్కడ జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. రెండు చోట్లా కలిపి మొత్తం 14 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభ్యమయ్యాయి.


2026 మార్చి నాటికి భారత దేశం నుంచి మావోయిజాన్ని పూర్తిగా తుడిచి పెట్టాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్దేశించిన గడువు దగ్గరపడుతోంది. ఈ క్రమంలోనే భద్రతా దళాలు తమ వేటను ముమ్మరం చేశాయి. గణాంకాల ప్రకారం.. 2024 నుంచి ఇప్పటి వరకు కేవలం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనే 500 మందికి పైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మరణించడం భద్రతా దళాల పట్టును సూచిస్తోంది.


ఓవైపు ఎదురుకాల్పులు.. మరోవైపు లొంగుబాటులు


ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు జరుగుతున్న రోజే.. తెలంగాణ పోలీసుల ముందు కీలక మావోయిస్టు నేతలు లొంగిపోవడం విశేషం. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) బెటాలియన్-1 కు చెందిన టాప్ కమాండర్ బర్సా దేవా అలియాస్ బర్సా సుక్కా సహా పలువురు మావోయిస్టులు తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఒకవైపు క్షేత్రస్థాయిలో అగ్రనేతల మృతి, మరోవైపు కీలక కమాండర్ల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ ప్రస్తుతానికి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ జరిగిన అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాలు గాలింపు చర్యలను మరింత ఉధృతం చేశాయి. శనివారం జరిగిన ఈ ఆపరేషన్లతో సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

Latest News
MP braces for intense chill; another Orange alert issued for Bundelkhand region Sat, Jan 10, 2026, 01:25 PM
Delhi stone-pelting case: Police nab three more accused, total arrests 16 Sat, Jan 10, 2026, 01:24 PM
Rouse Avenue Court order triggers political storm within RJD; family rift comes to fore Sat, Jan 10, 2026, 01:01 PM
Karnataka BJP urges Cong Gen Secy KC Venugopal to intervene over Kannada schools in Kerala Sat, Jan 10, 2026, 12:59 PM
Aviation accident watchdog recommends ATC video recording at international airports Sat, Jan 10, 2026, 12:57 PM