పెళ్లికి ముందు శృంగారం చేస్తే.. నేరుగా జైలుకే: ఇండోనేషియా సర్కారు సంచలన నిర్ణయం
 

by Suryaa Desk | Sat, Jan 03, 2026, 09:39 PM

పర్యాటక స్వర్గధామంగా పేరొందిన ఇండోనేషియాలో ఇకపై స్వేచ్ఛకు సంకెళ్లు పడనున్నాయి. దశాబ్దాల కాలం నాటి డచ్ వలసవాద చట్టాలను పక్కనపెట్టి.. సొంతంగా రూపొందించుకున్న నూతన శిక్షాస్మృతిని శుక్రవారం నుంచి ఆ దేశం అధికారికంగా అమలు చేస్తోంది. ఈ కొత్త చట్టం ప్రకారం.. వివాహానికి ముందు శృంగారంలో పాల్గొనడం, పెళ్లి కాకుండా సహజీవనం చేయడం ఇప్పుడు తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది.


ఏడాది పాటు జైలు శిక్ష.. ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చా?


నూతన శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 411 ప్రకారం.. వివాహం కాకుండా శృంగారంలో పాల్గొంటే గరిష్టంగా ఏడాది పాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధిస్తారు. అయితే ఇందులో ఒక కీలక నిబంధన ఉంది. కేవలం బాధితుల జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా పిల్లలు ఫిర్యాదు చేస్తేనే పోలీసులు కేసు నమోదు చేస్తారు. మూడవ వ్యక్తులు లేదా అపరిచితులు చేసే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోరు. అదేవిధంగా వివాహం చేసుకోకుండా జంటలు ఒకే ఇంట్లో కలిసి ఉంటే వారికి ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.


పర్యాటకులకూ వర్తింపు..


ఈ చట్టం కేవలం ఇండోనేషియా పౌరులకే కాకుండా.. అక్కడికి వెళ్లే విదేశీ పర్యాటకులకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా బాలి వంటి ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు వచ్చే విదేశీయులు ఈ చట్టం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ వ్యాపార సంఘాలు, హోటల్ అసోసియేషన్లు ఈ నిర్ణయంపై గళమెత్తాయి. ఈ కఠిన నిబంధనల వల్ల పర్యాటకులు ఇండోనేషియాకు రావడానికి వెనుకాడుతారని.. తద్వారా పర్యాటక రంగం, విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.


కేవలం శృంగారంపైనే కాకుండా.. దేశాధ్యక్షుడిని, ప్రభుత్వ సంస్థలను విమర్శించడం, జాతీయ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడటం కూడా ఈ కొత్త చట్టం ప్రకారం నేరాలుగా మారాయి. ఇది పౌర స్వేచ్ఛను అణచివేయడమేనని మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో 2019లో ఈ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు దేశవ్యాప్తంగా భారీ నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి.. సుదీర్ఘ చర్చల తర్వాత కొన్ని మార్పులతో ఇప్పుడు దీనిని అమలులోకి తెచ్చింది.


ప్రస్తుతం అకె వంటి ఇస్లామిక్ ప్రావిన్స్‌లలో ఇప్పటికే ఇలాంటి కఠినమైన షరియా చట్టాలు అమలులో ఉన్నాయి. ఇప్పుడు వాటిని దేశవ్యాప్తంగా విస్తరించడం ద్వారా ఇండోనేషియా తన సామాజిక విలువల రక్షణకు మొగ్గు చూపుతోందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆధునిక సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛకు ఇది అడ్డుకట్ట వేస్తుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

Latest News
Rural jobs: UP CM Adityanath criticises Congress for opposing VB-G RAM G Act Tue, Jan 06, 2026, 04:42 PM
Gujarat Giants aim for strong push in WPL 2026 Tue, Jan 06, 2026, 04:36 PM
China failing to boost its population after a decade of ending one-child policy Tue, Jan 06, 2026, 04:35 PM
Telenor finally exits Pakistan, joins MNC exodus Tue, Jan 06, 2026, 04:34 PM
Bangladesh's existence cannot be imagined without 1971 Liberation War: BNP's Tarique Rahman Tue, Jan 06, 2026, 04:29 PM