|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 07:24 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిసి.. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా మూడు దశలుగా రూ.20 వేలు అందించనున్నారు. తొలి రెండు విడుతలు రూ.7000 చొప్పున, మూడో విడతలో రూ.6000 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు విడతలుగా రైతులకు రూ.14000లను ఏపీ ప్రభుత్వం అకౌంట్లలో జమ చేసింది. మూడో విడత కింద రూ.6000 జమ చేయనుంది.
అయితే పీఎం కిసాన్ యోజన తో కలిసి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేసినప్పుడే.. అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో 2026 ఫిబ్రవరి నెలలో పీఎం కిసాన్ యోజన 22వ విడత సాయాన్ని కేంద్రం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత కూడా ఫిబ్రవరి నెలలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఇదే విషయాన్ని ఇటీవల వెల్లడించారు.
మంత్రి అచ్చెన్నాయుడు శనివారం కర్నూలు జిల్లా కోడుమూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఉల్లి రైతులకు నష్టపరిహారం అందించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన అచ్చెన్నాయుడు.. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్రంలోని రైతులకు 14 వేల రూపాయలు సహాయం అందించినట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత కింద ఫిబ్రవరి నెలలో రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.6000 చొప్పున జమ చేస్తామని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత డబ్బులు జమయ్యే అవకాశాలు ఉన్నాయని భావించవచ్చు. మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా.. అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధులు త్వరలోనే జమ చేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలోనే రైతుల అకౌంట్లలోకి ఆరు వేల రూపాయలు జమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Latest News