|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 07:41 PM
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భారతీరాజా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు చెన్నైలో ఆయన చికిత్స పొందుతున్న ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రి సోమవారం ఒక మెడికల్ బులెటిన్‌ను విడుదల చేసింది.తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా భారతీరాజాను క్రిటికల్ కేర్ యూనిట్ లో చేర్పించామని, ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఆయన అవయవాల పనితీరుకు సంబంధించిన చికిత్స కొనసాగుతోందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేసింది.మరోవైపు, భారతీరాజాను పరామర్శించేందుకు దర్శకులు ఆర్.కె. సెల్వమణి, ఏ.ఆర్. మురుగదాస్, సీమాన్, లింగుస్వామి, అమీర్ తదితరులు ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం సెల్వమణి మీడియాతో మాట్లాడుతూభారతీరాజా గారి ఆరోగ్యంపై వస్తున్న పుకార్ల నేపథ్యంలో మేము ఇక్కడికి వచ్చాం. వైద్యులతో మాట్లాడాం. ఆయనకు న్యుమోనియా సోకింది కానీ అవయవాలన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది అని తెలిపారు.సందర్శకుల వల్ల ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉండటంతో ఎవరినీ అనుమతించడం లేదని వైద్యులు చెప్పినట్లు సెల్వమణి వివరించారు. భారతీరాజా ఆరోగ్యంపై వదంతులు వ్యాప్తి చేయవద్దని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని అభిమానులను కోరారు. కుటుంబ సభ్యులు లేదా ఆసుపత్రి యాజమాన్యం అధికారికంగా ఇచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Latest News