|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 08:31 PM
వైస్ ఛాన్సలర్లు కేవలం పరిపాలన అధిపతులుగా మిగిలిపోకూడదని, విద్యారంగాన్ని నడిపించే నాయకులుగా, సంస్కరణల రాయబారులుగా పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. జ్ఞాన ఆధారిత సమాజాన్ని నిర్మించడంలో విశ్వవిద్యాలయాల పాత్ర అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం అమరావతిలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన జరిగిన పబ్లిక్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల సమీక్షా సమావేశంలో లోకేశ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.తన పాదయాత్రలో ఎంతో మంది యువతను కలిశానని, సర్టిఫికెట్లు చేతిలో ఉన్నా ఉద్యోగాలు లేక గందరగోళంలో ఉన్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సవాళ్లతో కూడిన విద్యాశాఖను తీసుకున్నానని తెలిపారు. రాష్ట్రంలోని ఉన్నత విద్యలో ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టి సారించాలని వీసీలకు దిశానిర్దేశం చేశారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకురావాలని, విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్‌మెంట్‌లు పెంచి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని సూచించారు.డిగ్రీలు పూర్తిచేసినా ఉద్యోగం రాక మన విద్యార్థులు అమీర్‌పేటలో శిక్షణ పొందితే కానీ ఉద్యోగం సాధించలేకపోతున్నారు. ఇది విద్యార్థుల వైఫల్యం కాదు, మన సంస్థల వైఫల్యంఅని మంత్రి లోకేశ్ అన్నారు. పరిశోధనలు కేవలం ప్రచురణలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. ప్రతి వారం విద్యార్థులతో నేరుగా మాట్లాడేందుకు 'ఓపెన్ హౌస్' నిర్వహించాలని వీసీలను కోరారు. అందరి కృషితో రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ప్రపంచస్థాయి సంస్థలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు.
Latest News