|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 08:55 PM
పదవీచ్యుతుడైన వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు భారత్‌తో అనుబంధం ఉంది. రాజకీయ అణచివేతలు, ప్రపంచవ్యాప్త ఆంక్షలకు చాలా కాలం ముందు, మదురో తన భార్య సిలియా ఫ్లోరెస్ ద్వారా భారతదేశంతో ఆధ్యాత్మిక అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. నికోలస్ మదురో, ఆయన భార్యను కూడా బంధించి వెనిజులా నుంచి విమానంలో అమెరికాకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే, మదురో, ఫ్లోరెస్‌లు పుట్టపర్తి సత్యసాయి బాబాకు పరమ భక్తులు. క్యాథిలిక్ అయిన మదురో పెళ్లికి ముందు తన భార్య ఫ్లోరెస్ ద్వారా సాయిబాబాతో పరిచయం ఏర్పడింది. ఈ దంపతులు అనంతపురంలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి 2005లో వచ్చి సాయిబాబాను కలుసుకున్నారు. అప్పట్లో బాబాతో ఈ దంపతులు దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబాను వ్యక్తిగతంగా కలిసిన మదురో, ఫ్లోరెస్ దంపతులు ఆయన పాదాల వద్ద చెరోవైపు కూర్చుని ఉన్నారు.
పుట్టపర్తి సత్యసాయి సాయిబాబాను ఆరాధించే మదురో.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రయివేట్ భవనంలో సిమోన్ బొలివర్, హ్యోగో చావెజ్ వంటి వెనుజులా గొప్ప నాయకులతో పాటు బాబా ఫోటోను గొడకు వేలాడదీశారు. బాబా 2011లో శివైక్యం చెందేనాటికి విదేశాంగ మంత్రిగా ఉన్న మదురో.. ఆయన మరణంపై అధికారిక సంతాప తీర్మానం ప్రకటించారు. మదురో మార్గదర్శకత్వంలో వెనుజులా జాతీయ అసెంబ్లీ ఓ అధికారిక తీర్మానం ఆమోదించి, మానవాళికి బాబా చేసిన ‘ఆధ్యాత్మిక సేవను’ అధికారికంగా గుర్తిస్తూ జాతీయ సంతాప దినాన్ని ప్రకటించింది.
సంవత్సరాలుగా అనేక విదేశీ సంస్థలు బహిష్కరణకు గురైనప్పటికీ సత్యసాయి సంస్థ ఆయన పాలనలో వెనిజులాలో తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంది. లాటిన్ అమెరికాలో అతిపెద్ద సాయిబాబా భక్త సమూహాలలో ఒకటి వెనిజులాలోనే ఉంది. ఇది 1974లోనే ఏర్పాటయ్యింది. 2024లోవెనిజులా ప్రభుత్వం ‘ఓం’ చిహ్నంతో కూడిన తమ జాతీయ దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలను పంపింది.
కాగా, గతేడాది నవంబరులో తన రాజకీయ సందేశాలను పక్కనబెట్టి బాబా శతజయంతిని గౌరవించారు. ఒక అధికారిక ప్రకటనలో ఆయన సాయిబాబాను ‘కాంతి స్వరూపుడు’ అని అభివర్ణించారు. ‘‘ఆయనను కలిసిన రోజును నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను... ఈ గొప్ప గురువు జ్ఞానం మనకు జ్ఞానాన్ని అందిస్తూనే ఉండాలి’’ ఆయన కోరుకున్నారు.
ఓ సాధారణ కుటుంబంలో నవంబరు 23, 1962లో మదురో జన్మించారు. ఆయన తండ్రి ఓ ట్రేడ్ యూనియన్ నాయకుడు. 1992లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్మీ అధికారి హ్యూగో చావెజ్ నాయకత్వంలో చేపట్టిన తిరుగుబాటు సమయానికి బస్ డ్రైవర్‌గా పనిచేశారు. సోషలిజం ఏమాత్రం ఆదరణలో లేని ఆ కాలంలో చావెజ్‌ను జైలు నుంచి విడుదల చేయాలని పోరాటం చేశారు. అనంతరం ఛావెజ్ తీవ్ర వామపక్ష సిద్ధాంతాలకు మద్దతు ఇచ్చారు.