|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 08:59 PM
ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌లో జిమ్ నిర్వహణ విషయంలో జరిగిన గొడవలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై దారుణంగా దాడి జరిగింది. నిందితులు దంపతులను కొట్టడమే కాకుండా.. వారి కుమారుడిని నడిరోడ్డుపై నగ్నంగా పరిగెత్తించి మరీ దాడి చేసి తీవ్రంగా అవమానించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. జనవరి 2వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటికి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితుడు రాజేష్ గార్గ్ తన ఇంటి బేస్‌మెంట్‌లో జిమ్ నడుపుతున్నారు. అయితే ఆ జిమ్ కేర్ టేకర్ సతీష్ యాదవ్ మోసపూరితంగా ఆ వ్యాపారాన్ని తన సొంతం చేసుకునేందుకు ప్రయత్నించాడని రాజేష్ గార్గ్ ఆరోపించారు. ఈనెల 2వ తేదీన రాజేష్ గార్గ్, ఆయన భార్య బేస్‌మెంట్‌లో వాటర్ లీకేజీని తనిఖీ చేసేందుకు వెళ్లారు. అదే సమయంలో సతీష్ యాదవ్ తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకుని ఘర్షణకు దిగాడు. నిందితులు రాజేష్ గార్గ్‌ను జిమ్‌లోకి లాక్కెళ్లి ఇనుప రాడ్లతో చితకబాదారు.
అంతేకాకుండా రాజేష్ గార్గ్ భార్యను జుట్టు పట్టి లాగి.. అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా నడిరోడ్డుపైకి నెట్టేశారు. అది గమనించిన వారి కుమారుడు ఆ గుంపును అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన నిందితులు.. అతనిని వీధిలోకి ఈడ్చుకెళ్లి.. బట్టలు విప్పించి నగ్నంగా నడిరోడ్డుపై నిలబెట్టి క్రూరంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆ ఆస్తి తమ పేరు మీద ఉందని రాజేష్ గార్గ్ భార్య రీటా గార్గ్ తెలిపారు. తమ సొంత ఆస్తిని తాము నిలబెట్టుకోలేమా అని ప్రశ్నించారు. తాను, తన భర్త ఇంటి ముందు నిలబడి ఉన్నపుడు.. నిందితులు వచ్చి దాడి చేశారని.. ఆ తర్వాత తమ కొడుకును కూడా కొట్టినట్లు పేర్కొ్న్నారు. వారు తనను కడుపులో తన్నారని.. తన జుట్టును లాగారని.. చాలా అవమానించారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను సహాయం కోసం పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తినట్లు గుర్తు చేశారు. తన కొడుకు చేతులు జోడించి వేడుకుంటున్నా వారు కనికరించలేదని.. ఇది అత్యాచారం కంటే తక్కువనా అంటూ నిలదీశారు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడిలో రాజేష్ గార్గ్ ముఖం వాచిపోగా.. ఆయన కుమారుడికి తల పగిలింది. పన్ను కూడా ఊడిపోయింది. పోలీసులు ఇప్పటికే ప్రధాన నిందితుడు సతీష్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు వికాస్ యాదవ్, శుభమ్ యాదవ్, ఓంకార యాదవ్ పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు ఆపరేషన్ చేపట్టారు.
Latest News