|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 10:18 PM
సాధారణంగా బంగారం, వెండి ధరల గురించి ప్రజల్లో ఎప్పుడూ చర్చ కొనసాగుతూనే ఉంటుంది. తాజా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. పెళ్లిళ్లు లేదా శుభకార్యాలు వచ్చినప్పుడు ముందుగా గుర్తొచ్చేది బంగారమే. గోల్డ్ ఆభరణాలు ధరించి నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని చాలామంది కోరుకుంటారు. ముఖ్యంగా భారతదేశంలో బంగారానికి భావోద్వేగ విలువ ఎక్కువ. అలంకారంగా ధరించడమే కాకుండా దీన్ని ఒక భద్రమైన ఆస్తిగా కూడా భావిస్తారు. చేతిలో డబ్బులు ఉన్నప్పుడు గోల్డ్ కొనుగోలు చేసి దాచుకోవడం, అలాగే డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టడం కూడా ఇప్పుడు సాధారణమైపోయింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా బంగారం, వెండి ధరల పెరుగుదల గురించే చర్చ జరుగుతుండగా, వీటితో పాటు ఇతర లోహాల విలువ కూడా క్రమంగా పెరుగుతోంది.బంగారం, వెండి ధరలు అంచనాలకు మించి పెరగడంతో గత కొంతకాలంగా రాగికి మంచి డిమాండ్ ఏర్పడింది. అనేక రకాల ఉత్పత్తుల తయారీలో రాగి విస్తృతంగా ఉపయోగించబడటంతో దాని ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో మరో మెటల్ వేగంగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. అదే లిథియం. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా లిథియానికి భారీ డిమాండ్ పెరిగింది. దాంతో ఈ లోహంలో పెట్టుబడులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. లిథియాన్ని ప్రధానంగా బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, ట్యాబ్లెట్‌ల తయారీలో కూడా దీని వినియోగం కీలకంగా మారింది. క్లీన్ ఎనర్జీ, ఇంధన రంగాల్లో లిథియం ప్రాధాన్యం మరింత పెరిగింది. డిమాండ్ పెరుగుతున్న కొద్దీ లిథియం ధరలు కూడా క్రమంగా ఎగబాకుతున్నాయి. అందువల్ల భవిష్యత్తులో ఈ మెటల్ మంచి లాభాలు అందించే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.సాంప్రదాయ బ్యాటరీలతో పోలిస్తే లిథియం బ్యాటరీలు వేగంగా ఛార్జ్ అవుతాయి. మెరుగైన పనితీరు, ఎక్కువ సామర్థ్యం వీటి ప్రధాన ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో లిథియం బ్యాటరీలకు డిమాండ్ తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల రాబోయే కాలంలో వీటి అవసరం మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో లిథియం నిల్వల విషయంలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత చిలీ, అర్జెంటీనా, బొలీవియా, చైనా వంటి దేశాల్లో కూడా భారీ నిల్వలు ఉన్నాయి. ఇదే క్రమంలో భారత్ కూడా లిథియం వనరులపై దృష్టి సారించింది. దేశంలో లిథియం నిల్వల కోసం అన్వేషణను ప్రారంభించింది. క్లీన్ ఎనర్జీ రంగాన్ని అభివృద్ధి చేయడం, విదేశీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం లిథియం అన్వేషణకు ప్రాధాన్యం ఇస్తోంది.
Latest News