|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 11:54 PM
వరుసగా రెండో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అమెరికా నుంచి కొత్త టారిఫ్ హెచ్చరికల బయాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ అమెరికా కొత్త భయాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రధాన షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, ట్రెంట్ కంపెనీల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. పెద్ద కంపెనీల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 376 పాయింట్ల మేర నష్టపోయింది. నిఫ్టీ 50 ఇండెక్స్ 26,200 దిగువకు పడిపోయింది.
అమెరికా ఆంక్షల వేళ రష్యా ముడి చమురును రిలయన్స్ దిగుమతి చేసుకుంటోందన్న కథనాలతో ఆ కంపెనీ షేర్లపై ఒత్తిడి పడింది. పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపడుతున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని కంపెనీ కొట్టిపారేసిన ఈ స్టాక్ ఇవాళ్టి ఇంట్రాడేలో 5 శాతం మేర నష్టపోయింది. చివరకు 4.39 శాతం నష్టంతో 1508 పాయింట్ల వద్ద స్థిరపడింది. క్యూ3 ఆదాయ అంచనాలు అందుకోవడంలో విఫలమైన క్రమంలో ట్రెంట్ కంపెనీ షేర్లు ఈరోజు ఏకంగా 8.46 శాతం మేర పడిపోయి రూ.4055 వద్ద స్థిరపడ్డాయి.
ఈరోజు ఇంట్రాడేలో సెన్సెక్స్ సూచీ ఉదయం 85,331 పాయింట్ల వద్ద నష్టాల్లోనే ట్రేడింగ్ మొదలు పెట్టింది. రోజు మొత్తం నష్టాల్లోనే కొనసాగుతూ వచ్చింది. ఇంట్రాడేలో ఒక దశలో 84,900 కనిష్ఠ స్థాయిని తాకి చివరకు 376 పాయింట్ల నష్టంతో 85,063 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 50 ఇండెక్స్ 71 పాయింట్ల నష్టంతో 26,178 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 90.16 వద్ద ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 61.84 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం ఔన్స్ రేటు గ్లోబల్ మార్కెట్లో 4449 డాలర్ల వద్ద ఉంది.
స్టాక్ మార్కెట్ జనవరి 6వ తేదీ ఇంట్రా డే ట్రేడింగ్‌లో ట్రెంట్, రిలయన్స్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటివి భారీగా నష్టపోయాయి. ట్రెంట్ షేరు 8.63 శాతం, రిలయన్స్ షేరు 4.47 శాతం, ఐటీసీ షేరు 2.07 శాతం, కోటక్ మహీంద్రా షేరు 2.03 శాతం మేర పడిపోయాయి. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, సన్ ఫార్మా, ఎస్‌బీఐ, టీసీఎస్ వంటి కంపెనీలు లాభపడ్డాయి.
Latest News