|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 01:08 PM
కర్ణాటకలోని హుబ్లీ నగరంలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ బీజేపీ మహిళా కార్యకర్తపై పోలీసులు దాడి చేసి, వివస్త్రను చేశారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఓటర్ల జాబితా సవరణ విషయంలో తలెత్తిన వివాదమే ఈ ఘటనకు దారితీసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బుధవారం బయటకు రావడంతో ఈ అమానుషం వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే... హుబ్లీ కేశ్వాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీ కార్యకర్త సుజాత హండి నివాసం ఉంటున్నారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఆమె ఓటర్ల మ్యాపింగ్ చేపట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ కార్పొరేటర్ సువర్ణ కల్లకుంట్ల, సుజాతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సుజాతను అరెస్ట్ చేసేందుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది.మగ పోలీసులు తనపై దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషిస్తూ, వివస్త్రను చేశారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. బయటకు వచ్చిన వీడియోలో కూడా ఓ పురుష పోలీస్ అధికారి, దుస్తులు లేని స్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తున్న సుజాత భుజాన్ని పట్టుకోవడం కనిపిస్తోంది. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ తెంగినకాయి తీవ్రంగా స్పందించారు. ఇది మహిళా లోకానికే జరిగిన అవమానమని, ఈ అమానుష చర్యకు పాల్పడిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Latest News