|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 01:14 PM
అమెరికాలో అక్రమ వలసలు, నేరాల నియంత్రణపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిప్పులు చెరిగారు. వెనిజువెలాకు చెందిన 'ట్రెన్ డీ అరాగువా'ముఠాను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గ్యాంగ్‌గా అభివర్ణించిన ఆయన ఆ ముఠా సభ్యులను 'జంతువులు'గా అభివర్ణించారు. వీరిని ఏరివేసే క్రమంలో ఇప్పటికే పలువురిని దేశం నుంచి బహిష్కరించామని, మరికొందరిని జైలుకు పంపామని వెల్లడించారు. డెమొక్రాట్ నాయకుల వైఫల్యం వల్లే నేరగాళ్లు రెచ్చిపోతున్నారని ఆయన ఆరోపించారు.కొలరాడోలో జరిగిన ఒక భయంకరమైన ఉదంతాన్ని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. గ్యాంగ్ సభ్యులు ఒక అపార్ట్‌మెంట్ భవనాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా అక్కడి యజమాని వేళ్లను నరికివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గవర్నర్లు చేష్టలు ఉడిగి చూస్తున్న తరుణంలో ఫెడరల్ ఏజెన్సీలు రంగంలోకి దిగి నేరగాళ్లను బయటకు లాగుతున్నాయని స్పష్టం చేశారు. స్థానిక యంత్రాంగం సహకరించని చోట తామే నేరుగా జోక్యం చేసుకుంటున్నామని వివరించారు.వాషింగ్టన్‌లో సైనికుల ఉనికిపై వస్తున్న విమర్శలను ట్రంప్ తోసిపుచ్చారు. భద్రతా దళాలు ఉన్నప్పుడే ప్రజలు సురక్షితంగా ఉన్నామని భావిస్తారని ఆయన వాదించారు. గతంలో వాషింగ్టన్‌లో వారానికి సగటున రెండు హత్యలు జరిగేవని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని పేర్కొన్నారు. నేరాలు తగ్గడంతో స్థానిక వ్యాపారాలు, రెస్టారెంట్లు మళ్లీ కళకళలాడుతున్నాయని చెప్పారు. ఇటీవల జరిగిన ఒక ఉగ్రవాద దాడిలో ఇద్దరు గాయపడిన విషయాన్ని అంగీకరిస్తూనే ప్రస్తుత భద్రతా ఏర్పాట్ల వల్ల పెను ప్రమాదాలు తప్పుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.
Latest News