|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 01:31 PM
రాష్ట్రంలోని రైతుల్లో భూ రికార్డులపై నమ్మకం, భరోసా కల్పించేలా కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియ సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం రెవెన్యూ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్ది, పారదర్శకంగా భూ యజమానులకు హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.పాస్ పుస్తకాల ముద్రణలో ఎటువంటి పొరపాట్లకు తావుండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో గ్రామసభలు నిర్వహించి, రైతుల నుంచి భూ వివరాలను సరిచూసుకున్న తర్వాతే తుది ముద్రణ చేపట్టాలని సూచించారు. కొత్త పుస్తకాలు ఎవరూ ట్యాంపర్ చేయలేకుండా, నకిలీలు సృష్టించే అవకాశం లేకుండా అత్యంత భద్రతా ప్రమాణాలతో రూపొందించినట్లు ఆయన తెలిపారు. భూ రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయాలన్నా యజమాని అనుమతి తప్పనిసరి అని సీఎం స్పష్టం చేశారు.భవిష్యత్తులో రెవెన్యూ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, రైతులు తమకు కావాల్సిన పాస్ పుస్తకాలను ఆన్‌లైన్‌లోనే పొందేలా టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి వివరించారు.
Latest News