|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 07:51 PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేందుకు ఎథిక్స్ కమిటీ సిద్ధమవుతోంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు రాని ఎమ్మెల్యేలకు తొలుత నోటీసులు ఇవ్వాలని.. నోటీసులపై వారి నుంచి వివరణ తీసుకోవాలని నిర్ణయించింది. ఎథిక్స్ కమిటీ సభ్యులు బుధవారం రోజున భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారని చర్చించారు. టీఏ, డీఏలు కూడా పొందుతున్నారని భేటీలో ప్రస్తావనకు వచ్చింది.
కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని.. ఆరుగురు అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారని చర్చించారు. ఈ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలనే అంశం గురించి చర్చ జరిగింది. త్వరలోనే వీరికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఎథిక్స్ కమిటీ నిర్ణయించింది. వివరణ తీసుకున్న తర్వాత.. ప్రజాభిప్రాయం తీసుకుని ఈ విషయంలో ముందుకెళ్లాలని ఎథిక్స్ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది.
ఎన్డీఏ కూటమి 164 చోట్ల విజయం సాధించగా.. వైసీపీ కేవలం11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సామర్థ్యంలో 10 శాతం సీట్లు రాకపోవటంతో వైసీపీకి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అయితే సభలో ప్రతిపక్షం లేదని.. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకూ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారు. ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజాసమస్యలపై గళమెత్తేందుకు అవకాశం ఉంటుందని జగన్ చెప్తున్నారు.
అయితే ఏపీ ప్రభుత్వం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటంతో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావటం లేదు. ఎమ్మెల్సీలు మాత్రం మండలి సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే సభకు రాని ఎమ్మెల్యేల విషయంపై ఎథిక్స్ కమిటి భేటీ అయ్యి చర్చించింది. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. వివరణ తీసుకున్న అనంతరం తదుపరి ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది.
Latest News