|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 08:07 PM
పుంగనూరులో మధ్యప్రదేశ్ వాసుల సమస్యపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అధికార యంత్రాంగం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.రాష్ట్రాలు, ప్రాంతాలు వేరువేరైనా మనమంతా భారతీయులమని.. ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలో అయినా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఎక్కడైనా పనులు చేసుకోవచ్చని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్థానికేతరుల పేరుతో అనుమతులు ఉన్నా పనులు చేయకుండా అడ్డు తగిలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అసలు విషయానికి వస్తే.. బుధవారం రోజున వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాండ్లా ఎంపీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సదుంలో మధ్యప్రదేశ్ వాసులు గ్రానైట్ మైనింగ్ కోసం అనుమతులు పొందారని, అయితే స్థానిక నాయకులు మైనింగ్ ప్రక్రియను అడ్డుకుంటున్నారని కులస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు.
ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మైనింగ్ ఎలా చేస్తారంటూ బెదిరింపులకు దిగుతున్నారని పవన్ కళ్యాణ్ దృష్టికి తెచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. అలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడే వారి పట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. అనుమతులు ఉన్న వారు నిబంధనలు ప్రకారం మైనింగ్ చేసుకునే ప్రక్రియను అధికార యంత్రాంగం చూస్తుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. సదుంలో అనుమతులు పొందిన వారే మైనింగ్ చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.
గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు
మరోవైపు ఏపీలో తీర ప్రాంత అడవుల రక్షణతో పాటుగా ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడానికి గ్రేట్ గ్రీన్ వాల్,గ్రీన్ కవర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనవరి నెలాఖరులోపు దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అనుబంధంగా ఉండే అన్ని ప్రభుత్వ విభాగాలతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు.
Latest News