|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 09:07 PM
ఒక్కోసారి ఎవరూ ఊహించని వింత ఘటనలు జరుగుతూ.. యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్య పరుస్తుంటాయి. చాలా మంది వాటిని నమ్మడానికి ఇష్ట పడకపోయినా కళ్లారా చూసిన వాళ్లు మాత్రం కచ్చితంగా నమ్ముతారు. ముక్కును వేలేసుకుంటూ మరీ ఈ వింతలను అందరికీ చెబుతుంటారు. అచ్చంగా ఇలాంటి ఘటనే జరిగి.. దేశం మొత్తం ఆ అంశం గురించి మాట్లాడుకునేలా చేసిందో మహిళ. ముఖ్యంగా ఓ మహిళ తొడకు.. గడ్డ అయింది. నొప్పి ఎక్కువై, అది పగిలిపోయి అందులోంచి రక్తం, చీముతో పాటు ఓ బుల్లెట్ కూడా బయటకు వచ్చింది. దీంతో ఆమె అవాక్కయింది. అసలు తన శరీరంలోకి బుల్లెట్ ఎలా వెళ్లిందో తెలియక గతాన్ని గుర్తు చేసుకుంటోంది.
అసలేం జరిగిందంటే..?
ఫరీదాబాద్‌లోని దబువా కాలనీలో నివసిస్తున్న 32 ఏళ్ల కవితకు ఇటీవల తొడ భాగంలో ఒక చిన్న గడ్డ అయింది. సాధారణ గడ్డే కదా అదే తగ్గిపోతుందిలే అని ఆమె భావించినప్పటికీ.. అది క్రమంగా పెద్దదై ఒకరోజు హఠాత్తుగా పగిలిపోయింది. ఆ సమయంలో కురుపు లోపలి నుంచి రక్తం చీముతో పాటుగా ఒక లోహపు వస్తువు బయటకు రావడాన్ని గమనించిన కవిత షాక్‌కు గురైంది. తీరా పరిశీలించి చూడగా అది ఒక తుపాకీ బుల్లెట్ అని తేలడంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. అసలు ఆమె శరీరంలోకి బుల్లెట్ ఎలా వెళ్లిందో అర్థం కాక తలలు బాదుకున్నారు.
ఈక్రమంలోనే కవిత తన 20 ఏళ్ల నాటి ఓ కథను గుర్తు తెచ్చుకుని అందరికీ చెప్పింది. ముఖ్యంగా ఆమె తన బాల్యంలో మనేసర్‌లోని కోటా ఖండేవాలా అనే గ్రామంలో చదువుకునేది. కవితకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒకరోజు పాఠశాలలో ఆడుకుంటుండగా గాలిలో నుంచి ఏదో పదునైన వస్తువు వేగంగా వచ్చి ఆమె తొడకు తగిలింది. ఆ సమయంలో రక్తం కారడంతో రాయి తగిలి గాయమైందని కుటుంబ సభ్యులు భావించారు. సాధారణ చికిత్సతో కొద్ది రోజుల్లోనే ఆ గాయం మానిపోయింది. ఆ తర్వాత ఆమెకు వివాహమై ఇద్దరు పిల్లలు కలిగినా.. ఇన్నేళ్లలో కనీసం నొప్పి గానీ, వాపు గానీ, ఇతర ఇబ్బందులు గానీ కలగలేదు.
కానీ హఠాత్తుగా ఓ గడ్డ అయి అలా బుల్లెట్ బయటకు రావడంతో.. షాకైన కవిత ఈ విషయాన్ని అందరికీ చెప్పింది. అసలు సర్జరీయే చేయకుండా ఓ బుల్లెట్ ఇలా బయటకు రావడంతో.. ఈ వార్త వైరల్ అయింది. ముఖ్యంగా కవిత చిన్నతనంలో నివసించిన కోటా ఖండేవాలా గ్రామం ఒక సైనిక శిక్షణ శిబిరానికి సమీపంలో ఉండేదని.. అక్కడ సైనికులు లక్ష్యాలను ఛేదించే క్రమంలో కాల్చిన బుల్లెట్ దారి తప్పి వచ్చి ఆమె శరీరంలోకి దూసుకుపోయి ఉండవచ్చని ఇప్పుడు అంతా భావిస్తున్నారు.
సాధారణంగా శరీరంలోకి బుల్లెట్ వంటివి వెళ్తే ఇన్ఫెక్షన్ సోకుతుంది. కానీ కవిత విషయంలో అటువంటిదేమీ జరగకుండా.. 20 ఏళ్ల పాటు అది కండరాల మధ్య నిశ్శబ్దంగా ఉండిపోవడం ఒక వైద్య అద్భుతంగా వైద్యులు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం కవిత ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు. ప్రాణాపాయం తప్పి, ఆ బుల్లెట్ వాటంతట అదే బయటకు రావడంపై ఆమె కుటుంబ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మెడికల్ మిరాకిల్‌ను చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.