|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 09:13 PM
ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో రష్యాకు చెందిన ‘మరినేరా’ అనే ఆయిల్ ట్యాంకర్‌ను అమెరికా దళాలు వెంబడించి స్వాధీనం చేసుకున్నాయి. రెండు వారాలకు పైగా ఈ నౌకను అమెరికా సైన్యం వెంబడించడం గమనార్హం. వాషింగ్టన్ ఆంక్షలను ఉల్లంఘించినందుకే ట్యాంకర్‌ను సీజ్ చేసినట్లు అమెరికా సైన్యం యూరోపియన్ కమాండ్ ఎక్స్ (ట్విట్టర్)లో ప్రకటించింది. ఈ ఆపరేషన్‌ను జస్టిస్, హోంల్యాండ్ సెక్యూరిటీ, డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా చేపట్టాయి. అధ్యక్షుడు ఆదేశాల మేరకు పశ్చిమార్ధగోళ భద్రతకు ముప్పు నేపథ్యంలో ఆంక్షలు విధించిన నౌకలను లక్ష్యంగా చేసుకుని ఈ చర్య తీసుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
‘‘ఈ ఆపరేషన్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్, డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ భాగస్వామ్యం, మద్దతుతో జరిగింది. ఇది మన దేశాన్ని రక్షించడానికి ప్రభుత్వం విధానాన్ని తెలియజేస్తుంది’’ అని పేర్కొన్నారు. ‘మరినేరా’ నౌకను అమెరికా కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకునే సమయంలో సమీపంలో ఎలాంటి రష్యా నౌకలు లేవని ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. దీనివల్ల అమెరికా, రష్యా బలగాల మధ్య ఘర్షణ తప్పింది.
ట్యాంకర్‌ను హెలికాప్టర్ సమీపిస్తున్నట్లు రెండు అస్పష్టమైన ఫోటోలను రష్యా అధికారిక టెలివిజన్ విడుదల చేసింది. అమెరికా అధికారులు కూడా బలగాలు నౌకను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయని రాయిటర్స్ నివేదించింది. గతంలో బెల్లా 1గా పిలిచే ఈ ట్యాంకర్‌పై 2024లో అమెరికా ఆంక్షలు విధించింది. ఆ తర్వాత దీని పేరును ‘మరినేరా’గా మార్చారు. ఇది ఇరాన్ నుంచి వెనిజులాకు వెళ్తూ ఆమెరికా ఆంక్షల నేపథ్యంలో అట్లాంటిక్ మహాసముద్రంలోకి ప్రవేశించి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఐస్‌లాండ్‌లోని అమెరికా స్థావరాల నుంచి వచ్చిన విమానాలతో సహా అనేక నిఘా విమానాలు ఈ నౌకను గత కొన్ని రోజులుగా నిశితంగా గమనించాయి. బ్రిటన్ ఆస్తులు కూడా ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నాయి.
గతంలో కూడా అమెరికా బలగాలు ఈ ట్యాంకర్‌ను ఆపడానికి ప్రయత్నించాయి. డిసెంబరులో వెనిజులా సమీపంలో నౌకను స్వాధీనం చేసుకునే ప్రయత్నాన్ని సిబ్బంది తిప్పికొట్టారని నివేదికలు వచ్చాయి. ఆ సంఘటన తర్వాత నౌకపై రష్యా జెండాను పునరుద్దరించారు. ఆ నౌకను రష్యా అధికారిక షిప్పింగ్ రిజిస్ట్రీలో చేర్చారు. అనంతరం ఈ నౌకను వెంబడించడం ఆపాలని అమెరికా కోరుతూ మాస్కో అధికారిక దౌత్య నిరసన తెలియజేసింది.
ఇదిలా ఉండగా, అమెరికా కోస్ట్ గార్డ్ లాటిన్ అమెరికా జలాల్లో వెనుజులాకు సంబంధించిన మరో ట్యాంకర్‌ను కూడా అడ్డుకున్నట్టు అమెరికా అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. వెనుజులాలో అమెరికా ఆపరేషన్ నేపథ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో రష్యా నౌకను స్వాధీనం చేసుకోడవం ప్రాధాన్యత సంతరించుకుంది.
Latest News